శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లోని ఉధంపూర్‌లో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారు జామున రెండు బస్సుల్లో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. తొలి పేలుడులో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 10.30 సమయంలో దొమాయిల్ చౌక్ లోని ఓ పెట్రోల్ పంప్ సమీపంలో నిలిపిన బస్సులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో కండక్టర్ సునీల్ సింగ్ , మరో వ్యక్తి గాయపడ్డారు. పేలుడు జరిగే సమయంలో వీరు బస్సు లోని డ్రైవర్ క్యాబిన్‌లో కూర్చొని ఉన్నారు. ఈ బస్సు నిత్యం ఉధంపూర్ రామ్‌ఘర్‌బసంత్‌ఘర్‌కు ప్రయాణికులను చేరవేస్తుంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రామ్‌ఘర్‌కు పంపేందుకు కొన్ని దుప్పట్లను బస్సుపై లోడు చేశారని బాధితులు తెలిపారు.
ఆ తర్వాతే పేలుడు జరిగినట్టు చెప్పారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ఉధంపూర్ లో మరో బస్సులో పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఉధంపూర్ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దాదాపు ఆరు నెలల క్రితం కూడా ఉధంపూర్‌లో బాంబు పేలుడు సంభవించింది. స్థానిక సల్తియా చౌక్ వద్ద మాగ్నెటిక్ బాంబ్ పేలి ఒకరు మరణించగా, 17 మంది గాయపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరో మూడు రోజుల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుండగా ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. ఆయన త్రికూట్ హిల్స్ లోని మాతా వైష్ణోదేవిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ దళాలు అప్రమత్తమయ్యాయి.