ఇస్లామాబాద్: ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం పాకిస్థాన్‌లో జంట పేలుళ్లు సంభవించి 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం బయట సంభవించిన మొదటి పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, తర్వాత కొద్ది సేపటికే అఫ్గానిస్థాన్ సరిహద్దు లోని ఖిల్లా సైపుల్లా పట్టణంలో జామియత్ ఉలేమా ఇస్లామ్ (జెయుఐ) పార్టీ కార్యాలయం వద్ద రెండో బాంబు పేలింది. గతం లోనూ ఈ పార్టీ లక్షంగా మిలిటెంట్ దాడులు జరిగాయని స్థానిక ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యుల మని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
ఫిబ్రవరి 8 గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అనేక రాష్ట్రాల అసెంబ్లీలు ఓటింగ్‌కు వెళ్ల నున్నాయి. పాకిస్థాన్ ముస్లిం లీగ్(ఎన్) అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్ నుంచి వచ్చి గత కొన్ని నెలలుగా ఇక్కడే ఉంటున్నారు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరుస కేసులతో, శిక్షలతో సతమతమవుతున్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్న పాక్‌లో గత కొన్ని నెలలుగా బాంబు దాడులు వరుసగా జరుగుతున్నాయి. ఈ సంఘటనల్లో భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.