న్యూ జెర్సీకి చెందిన ఓ జంట కవలలకు జన్మనిచ్చింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా? సాధారణంగా కవలలు కొన్ని సెకన్ల వ్యవధిలో లేదా ఒకటి రెండు నిమిషాల వ్యవధిలో పుడతారు. కానీ వీరు వేర్వేరు రోజుల్లో, వేర్వేరు సంవత్సరాల్లో కవలలకు జన్మనిచ్చారు. మరి ఇది గొప్పే కదా!
బిల్లీ హంఫ్రే భార్య ఈవ్ ఏ హంఫ్రేకు నెలలు నిండాయి. వెంటనే న్యూ జెర్సీకి సమీపంలోని వర్చువా వూరీస్ ఆస్పత్రిలో చేరింది. ఆమె 2023 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.48 గంటలకు మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 30 నిమిషాలకు అంటే 12.28 గంటలకు రెండో బిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి 12 గంటలు దాటడంతో కొత్త సంవత్సరంలోకి వచ్చేసినట్టే లెక్క కదా! అంటే రెండో బిడ్డ జనవరి 1, 2024లో పుట్టాడన్నమాట. కవలలిద్దరూ మగ పిల్లలే.
మరొక విశేషమేమిటంటే, ఈ కవలల తండ్రి బిల్లీ హంఫ్రే పుట్టినరోజు కూడా డిసెంబర్ 31 కావడం. అంటే కవలల్లో మొదటి బిడ్డ పుట్టినరోజు, తండ్రి పుట్టినరోజు ఒకటేనన్నమాట.