Wednesday, January 22, 2025

మహిళపై మూత్ర విసర్జన కేసులో కొత్త ట్విస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి నూఢిల్లీ వచ్చే ఎయిర్ ఇండియా విమానంలో తన సహ ప్రయాణికురాలైన ఒక మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు తాను ఏ పాపం ఎరుగనని కోర్టులో వాదించాడు. ఆ రోజు విమానంలో తాను ఆ మహిళపై మూత్ర విసర్జన చేయలేదని అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎదుట శుక్రవారం మిశ్రా వాదించాడు. మిశ్రాను పోలీసు కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల అభ్యర్థనను మెజిస్టీరియల్ కోర్టు తిరస్కరించడంతో దీనిపై పోలీసులు అదనపు సెషన్స్ న్యాయమూర్తి హర్‌జ్యోత్ సింగ్ భల్లాను ఆశ్రయించారు.

ఈ సందర్భంగా మిశ్రా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ మిశ్రా నిందితుడు కాదని, ఆయన కాకుండా వేరే ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసి ఉండవచ్చని, లేదా ఆ మహిళే మూత్ర విసర్జన చేసి ఉండవచ్చని వాదించారు. ప్రొస్ట్రేట్‌కు సంబంధించిన ఏదో వ్యాధితో ఆ మహిళ బాధపడుతోందని, ఇలా చాలా మంది డ్యాన్సర్లు బాధపడుతుంటారని, పైగా ఆమె కూర్చున్న సీటు వద్దకు ఎవరూ వెళ్లలేరని మిశ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెనుక నుంచి మాత్రమే ఆమె సీటు వద్దకు వెళ్లవచ్చని, ఒకవేళ మూత్ర విసర్జన చేసినా అది ఆమె ముందు వరకు వెళ్లదని న్యాయవాది అన్నారు.

ఈ కేసును పోలీసులు, మీడియా ఒక జోక్‌గా మార్చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సంఘటన జరిగిన తర్వాత మరుసటి రోజున ఫిర్యాదుదారు ఫిర్యాదు చేశారని, పైగా తనకు టికెట్ చార్జీ వాపసు చేయాలనే ఆమె కోరారని న్యాయవాది తెలిపారు. ఆమె కోరినట్లే ఎయిర్‌లైన్ డబ్బు వాపసు చేసిందని ఆయన తెలిపారు. మిశ్రా హత్య చేసినట్లు బెంగళూరుకు వెళ్లి ఆయనను అరెస్టు చేశారని, ఆయన ఉద్యోగం కూడా పోయిందని న్యాయవాది అన్నారు. కాగా..మిశ్రాను ఇంటరాగేట్ చేయాలని కోరుతూ పోలీసులు దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌ను అదనపు సెషన్స్ న్యాయమూర్తి కొట్టివేశారు. మిశ్రా ఈ వాదనను గతంలో మెజిస్టీరియల్ కోర్టులో వినిపించలేదని పేర్కొన్న న్యాయమూర్తి తాజాగా మెజిస్టీరియల్ కోర్టులో పిటిషన్ వేయాలని పోలీసులకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News