న్యూఢిల్లీ: తమ సంస్థ నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోస్ట్ చేసిన రెండు ట్వీట్లను ట్విట్టర్ ఇండియా గురువారం తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన సాగిస్తున్న రైతులను కంగనా రనౌత్ ఇటీవల తన ట్వీట్ల ద్వారా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ట్విటర్ రూల్స్‌ను ఉల్లంఘించిన కారణంతో ఆ ట్వీట్లను తొలగించినట్లు కంగన పోస్ట్ చేసిన ట్వీట్ల కోసం సెర్చ్ చేసినపుడు అక్కడ మెసేజ్ దర్శనమిస్తోంది. కంగన చేసిన వివాదాస్పద ట్వీట్లలో ఒకటి దేశం నుంచి క్యాన్సర్‌ను నిర్మూలించడంపై వ్యాఖ్యలు ఉన్నాయి.
కంగనపై ట్విటర్ చర్యలు తీసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. అమేజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ తాండవ్ కు సంబంధించిన వివాదంపై చేసిన ట్వీట్లకు గాను గత నెలలో కొద్దిరోజులు ఆమె ట్విటర్ అకౌంట్‌ను ట్విటర్ ఇండియా నిలిపివేసింది. ఆ ట్వీట్‌లో కంగన వారి తలలు తీసేయడానికి సమయం ఆసన్నమైందిఅంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా.. రైతుల ఆందోళనకు మద్దతుగా ఇంటర్నేషనల్ పాప్‌స్టార్ రిహానా ట్వీట్ చేసిన తర్వాత మంగళవారం నుంచి కంగన ట్వీట్లు జోరందుకున్నాయి. బాలీవుడ్ నటి తాప్సీ పన్నుపై కూడా కంగన తన ట్వీట్లతో విరుచుకుపడింది.