Monday, December 23, 2024

ట్విటర్ వినియోగదారులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల అధికారిక ట్విటర్ అకౌంట్‌లకు తొలగించిన బ్లూటిక్ వెరిఫికేసన్ మార్క్‌లను మళ్లీ పునరుద్ధరించాలని ట్విటర్ అధినేత ఎలాన్‌మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్‌కు మస్క్ ఛార్జీలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నిర్ణయించిన గడువు లోగా డబ్బులు చెల్లించకపోతే వెరిఫికేషన్ మార్క్ తొలగిస్తామని కూడా చెప్పారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ ఖాతాల వెరిఫికేషన్ మార్క్‌ను తొలగించడమైంది. ఈ కారణంగా ప్రజాప్రతినిధుల నుంచి సినీ ప్రముఖుల వరకు ట్విటర్ బ్లూ మార్క్‌ను కోల్పోయారు. అయితే ఇప్పుడు బ్లూమార్క్‌ను తొలగించిన అకౌంట్లను మళ్లీ పునరుద్ధరించడం జరుగుతోంది.

బ్లూటిక్‌ను ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. బ్లూటిక్ వెరిఫికేషన్ ఉన్న అకౌంట్లకు వన్ బిలియన్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలను మస్క్ తిరిగి పునరుద్ధరించారు. శుక్రవారం బ్లూ చెక్ మార్కు కోల్పోయిన చాలా మంది ప్రముఖుల ఖాతాల్లో ఆదివారం మళ్లీ అది ప్రత్యక్షమంది. బాలీవుడ్ తారలు షారూక్ ఖాన్, అలియా భట్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ధోనీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ బిల్‌గేట్స్, రాజకీయ ప్రముఖులు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మాజీ జమ్ముకశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా వంటి వారి ట్విటర్ ఖాతాలన్నింటికీ ఇప్పుడు బ్లూ టిక్ మార్క్ ఉండడం గమనించదగినది.

ఒమర్ అబ్దుల్లా డబ్బులు చెల్లించక పోయినప్పటికీ బ్లూటిక్ మార్క్ రావడంతో ఆయన నా అకౌండ్‌కు చెల్లించావా? అని ప్రశ్నిస్తూ నేరుగా మస్క్‌కు ట్వీట్ చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత మాలాలా యూసఫ్ జాయి తన ట్విటర్‌కు బ్లూటిక్ రావడంతో ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేశారు. వీరంతా రెండు రోజుల క్రితం బ్లూచెక్ మార్క్ కోల్పోయిన వారే. ఇప్పుడు వీరు డబ్బులు చెల్లించి ట్విటర్ బ్లూ సేవలను సబ్‌స్కైబ్ చేసుకున్నారా అన్న అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. బ్లూటిక్ పొందిన వారిలో దివంగత ప్రముఖులు కూడా ఉన్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్, ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రిషి కపూర్, గాయకుడు మైకేల్ జాక్స్, బాస్కెట్ బాల్ ఆటగాడు కోబే బయంట్, క్రికెటర్ షేన్‌వార్న్ వంటి ప్రముఖుల ఖాతాలు ఉన్నాయి.

ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేకు ట్విటర్‌లో 6.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నప్పటికీ ఆయన ఖాతాలో ఇప్పటికీ బ్లూటిక్ కనిపించడం లేదు. అయితే లెబ్రాన్ జేమ్స్, విలియం శాట్నర్, స్టీఫెన్‌కింగ్ వంటి వారి ఖాతాలకు తానే స్వయంగా ఛార్జీలు చెల్లిస్తున్నట్టు ఎలాన్ మస్క్ చెప్పారు. వీరంతా తాము ట్విటర్ బ్లూను సబ్‌స్ర్కైబ్ చేసుకోబోమని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ట్విటర్ మొట్టమొదటిసారి 2009లో బ్లూటిక్ ఖాతాను ప్రవేశ పెట్టింది. వాటిపై ఎలాంటి డబ్బులు చెల్లించే అవసరం ఏదీ లేదు. అయితే 2022లో ట్విటర్ అధినేతగా మస్క్ బాధ్యతలు చేపట్టిన తరువాత ట్విటర్ బ్లూటిక్ అకౌంట్లకు ఛార్జీలు చెల్లించాలన్న నిబంధన అమలులోకి తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి వెరిఫికేషన్ బ్యాడ్జీలను తొలగిస్తామని హెచ్చరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 11న మస్క్ ట్వీట్ చేశారు. దాంతో వెరిఫికేషన్ బ్యాడ్జీలన్నీ డిలీట్ అయ్యాయి. దీంతో సెలబ్రిటీ ట్విటర్ యూజర్లు మస్క్ తీసుకున్న చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిగ్‌బీ లాంటి వారు కూడా తాము ట్విటర్ బ్లూ కోసం డబ్బులు చెల్లించినా బ్యాడ్జీని ఎందుకు తొలగించారంటూ మస్క్‌పై ధ్వజమెత్తారు. ఏదేమైనా తాజాగా అధికారిక అకౌంట్లకు బ్లూ చెక్ మార్క్‌లు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News