Monday, November 25, 2024

యుపి బాలికల మృతి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two accused arrested in UP girl' murder case

 

పురుగుల మందు సేవింపజేసి హత్య
పోలీస్ పహారా మధ్య అంత్యక్రియలు

ఉన్నావో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఇద్దరు టీనేజ్ బాలికల కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు లఖ్నో ఐజి లక్ష్మీసింగ్ తెలిపారు. మరోవైపు వారిద్దరి అంత్యక్రియల్ని భారీ బందోబస్త్ మధ్య శుక్రవారం వారి స్వగ్రామంలో నిర్వహించారు. బాలికలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. దాంతో, గ్రామానికి నలుదిక్కులా కిలోమీటర్‌మేర పోలీసుల్ని మోహరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. బాలికలకు నిందితులు పురుగులమందు కలిపిన నీళ్లు ఇవ్వడం వల్లే వారు మృతి చెందినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బాబూహరా గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం ఉదయం 16,15,14 ఏళ్ల బాలికలు పశువులకు గడ్డి తేవడానికని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు. వారు తిరిగి రాకపోవడంతో అదేరాత్రి బంధువులతో కలిసి వారి కుటుంబసభ్యులు వెతకగా, వ్యవసాయ క్షేత్రంలో అపస్మారకస్థితిలో కనిపించారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇద్దరు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాణాలతో ఉన్న 16 ఏళ్ల బాలికను వైద్యుల సూచనమేరకు కాన్పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలికకు చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు బాలికల శవాల్ని పోస్ట్‌మార్టమ్ అనంతరం గురువారమే గ్రామానికి తీసుకెళ్లినా, ఉద్రిక్తత వల్ల అంత్యక్రియల్ని ఒక రోజు వాయిదా వేశారు. అంతిమ సంస్కారాలకు బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ్‌కిషోర్ రావత్, స్థానిక ఎంఎల్‌ఎ అనిల్‌సింగ్ హాజరయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, చికిత్స పొందుతున్న బాలికకు రూ.2 లక్షల పరిహారాన్ని యుపి ప్రభుత్వం ప్రకటించింది.

ఈ కేసులో గురువారమే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించడంతో పలు అంశాలు వెలుగుచూశాయి. ఈ ఘటనతో సంబంధమున్న ఇద్దరిని గుర్తించి, వారిని అరెస్ట్ చేశామని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితుల్లో ఒకడి పేరు వినయ్ అలియాస్ లంబూ, మరొకడు మైనర్ అని పోలీసులు తెలిపారు. ఆ బాలికల్లో ఒకరి పొలం పక్కనే వినయ్ పొలం కూడా ఉన్నది. లాక్‌డౌన్ సమయంలో ఆ బాలికతో మాటామాటా కలిపి ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు బాలిక నిరాకరించింది. దాంతో, కక్ష పెంచుకున్న వినయ్ ఆ బాలికకు పురుగుల మందు కలిపిన నీళ్ల బాటిల్ ఇచ్చాడు. మిగతా బాలికలు కూడా ఆ నీళ్లు తాగారా అన్నది తనకు తెలియదని వినయ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. వినయ్ ఫోన్‌కాల్ వివరాలను పరిశీలిస్తే ఘటన జరిగిన సమయంలో అతడు ఆ ప్రాంతంలోనే ఉన్నట్టు తేలిందని ఐజి తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాలికే లక్ష్యంగా వినయ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News