ద్వితీయశ్రేణి నగరాలకు విమాన సౌకర్యం కల్పనకు ప్రధాని మోడీ కృషి
మామునూరు ఎయిర్‌పోర్టుతో వారసత్వ కట్టడాల సందర్శన సులభం
రెండో విమానాశ్రయం ఏర్పాటుతో రాష్ట్రంలో మరింత అభివృద్ధి
: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విమానాశ్రయాలు ఉన్నాయని, తెలంగాణలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో విమానాశ్రయం ఒకటే ఉందని, ఇప్పుడు మరొకటి రాబోతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని వరంగల్, భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో విమాన సదుపాయాలను కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. పర్యాటకం, వాణిజ్యం కోసం వరంగల్‌తో అనుసంధానత కోసం వివిధ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు. మామునూరు విమానాశ్రయం పునర్వినియోగంలోకి తీసుకురావడం ద్వారా వరంగల్ చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ విమానాశ్రయాన్ని ఉడాన్ స్కీమ్‌తో అనుసంధానం చేస్తూ కమర్షియల్ ఆపరేషన్స్ కు సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. వరంగల్ మామూనూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం అనుమతించిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ కవాడీగూడలో పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి కిషన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. చరిత్రాత్మకమైన ఓరుగల్లు పట్టణానికి విమాన సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వరంగల్ శివారులోని మామునూరు బ్రౌన్ ఫీల్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టుకు గుర్తింపు ఉందని తెలిపారు.
అంతటి పురాతనమైన ఈ విమానాశ్రయానికి పునర్వైభవం కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. వరంగల్లుకు కాకతీయుల నాటి వైభవాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వివరించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు రాక ముందు గుర్తింపు కోసం పోటీపడిన సమయంలో అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేందుకు ఎటువంటి సదుపాయం లేని రామప్ప దేవాలయానికి ఎందుకు గుర్తింపు ఇవ్వాలని నిరాకరించారని గుర్తు చేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటు ద్వారా వరంగల్ నగరానికి అనుసంధానం చేయడం వల్ల అంతర్జాతీయ పర్యాటకులకు ఇబ్బంది ఉండదని ప్రధాని మోడీ హామీ ఇస్తూ లిఖితపూర్వకంగా ఇవ్వడం వల్ల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివరించారు.
వరంగల్‌లో అనేక వారసత్వ కట్టడాలు ఉన్నాయని వీటికి యునెస్కో గుర్తింపు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమించారని చెప్పారు. రామప్ప సహా పలు చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు చేరేందుకు ఈ ఎయిర్‌పోర్టు సులువుగా ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకు గాను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రెండో విమానాశ్రయం ఏర్పాటుతో మరింత అభివృద్ధికి బాటలు వేస్తుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రధాని చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. వరంగల్ విమానాశ్రయం అభివృద్ధితో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారుతాయని ఆయన చెప్పారు.