ఝాన్సీ(ఉత్తర్ ప్రదేశ్): ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఒక బోగీల తమపై ముగ్గురు సైనిక జవాన్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఇద్దరు మహిళలు జిఆర్‌పి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులలో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో సైనిక జవాను పరారీలో ఉన్నాడని జిఆర్‌పి సర్కిల్ ఆఫీసర్ మొహమ్మద్ నయీం అన్సారీ తెలిపారు.
తన ఫోన్ పోయిందని చెప్పి ఒక జవాను తమ మొబైల్ ఫోన్ అడిగినట్లు బాధిత మహిళలు తెలిపారని ఆయన చెప్పారు. ఆ ఇద్దరు మహిళలను మాటల్లో పెట్టి వారిని 7వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న తమ బోగీ వద్దకు తీసుకెళాడని ఆయన చెప్పారు.
బోగీలో మరో ఇద్దరు జవాన్లు ఉన్నారని, ఈ ముగ్గురు జవాన్లు ఆ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత వారిని అక్కడ నుంచి వెళ్లిపొమ్మన్నారని అధికారి చెప్పారు. ఆ మహిళలకు ఫోన్ వాపసు కూడా చేయలేదని ఆయన చెప్పారు.
వెంటనే ఆ ఇద్దరు మహిళలు జిఆర్‌పి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆర్మీ జవాన్లు సందీప్, రవీంద్ర, సురేష్‌పై కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో జవాను పారిపోయాడని ఆయన చెప్పారు. ఘటన జరిగిన రైల్వే బోగీని తనిఖీ చేసిన జిఆర్‌పి అధికారులు ఈ సంఘటనపై సైనికాధికారులకు సమాచారం అందచేశారు.