Wednesday, January 22, 2025

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రూ.500 నోట్లను చెలామణి చేస్తున్న చిత్తూరు ముఠా
రూ.6.62లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్‌ఓటి, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటి, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూ.6.62లక్షల నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపి రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పుంగనూరుకు చెందిన గంగరాజా, అభినందన్ కలిసి నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నాడు. ఇద్దరు నిందితులు రూ.500 నోట్లకట్టలలో పైన, కింద అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లను పెట్టి చెలామణి చేస్తున్నారు.

గంగరాజు స్టాక్ బ్రోకరేజ్ బిజినెస్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన సచిన్ పవార్, సురేష్ పవార్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నకిలీ కరెన్సీ తయారీ వీడియోను చూశాడు. వెంటనే వారిని వీడియో కాల్స్ ద్వారా పలుమార్లు సంప్రదించారు. అసలు నోటుకు ఐదు నకిలీ నోట్లు(1ః5) సరఫరా చేస్తామని చెప్పారు. దీనికి అంగీకరించిన ఇద్దరు నిందితులు, కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లోని ఛద్వేల్‌కు వెళ్లి సచిన్ పవార్, సురేష్ పవార్ ను కలుసుకున్నారు.

నకిలీ నోట్లును పరీక్షించడానికి వారి వద్ద నుంచి 10 నకిలీ నోట్లను కొనుగోలు చేసి సికింద్రాబాద్‌కు వచ్చారు, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన లక్కీ అనే వ్యక్తికి 5 నోట్లు ఇచ్చి మార్కెట్లో మార్పిడి చేయించారు. సులభంగానే నకిలీ నోట్లు చెలామణి జరగడంతో గంగారాజు రూ.3.5 లక్షలు తీసుకుని ఇద్దరూ బెంగుళూరు, సూరత్, నందుర్ బార్ మీదుగా మహారాష్ట్రలోని ఛద్వేల్ అనే పట్టణానికి చేరుకుని సచిన్ పవార్, సురేష్ పవార్‌లను కలిసి వారికి రూ.3.5లక్షలు ఇచ్చి వారి వద్ద నుంచి రూ.17లక్షల నకిలీ నోట్లను తీసుకుని బయలుదేరారు. సచిన్‌పవార్, సురేష్ పవార్ పెద్ద ఎత్తున నకిలీ నోట్లు ముద్రించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఏజెంట్లను నియమించుకుని చెలామణి చేస్తున్నారు.

ఎన్నికల సమయం కావడంతో దేశవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయి. పట్టుబడతామని భయపడిన గంగరాజు కొన్ని నకిలీ నోట్లు పారేసి, బెంగళూరుకు వెళ్లాడు, అక్కడి నుంచి తమిళనాడులోని తిరువూరుకు వెళ్లాడు. అక్కడ రవి అనే వ్యాపారితో నకిలీ నోట్ల చెలామణిపై డీల్ మాట్లాడాడు, ఇద్దరి మధ్య కుదరకపోవడంతో అక్కడ ఇనుంచి హైదరాబాద్‌కు వచ్చి సికింద్రాబాద్‌లోని లాడ్జిలో బస చేశాడు. మల్కాజిగిరిలోని సాయిరాం థియేటర్ సమీపంలో ఉంటున్న నరేష్ అని వ్యక్తి సాయంతో బైక్‌ను అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకున్న గ్లామర్ బైక్ పై నకిలీ నోట్లను విక్రయించేందుకు మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోని మెహఫిల్ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. అక్కడ నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు విషయం తెలిసింది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ చెలామణిలో ఎవరెవరు ఉన్నారే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ కరెన్సీ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు చిల్డ్రన్స్ బ్యాంక్ ఆప్ ఇండియాగా ముద్రించారు, ఇది తప్ప మిగతాది నిందితులు ఒరిజినల్ నోటు వలే ముద్రించారు. కేసు నమోదు చేసుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ 500 రూపాయల నోటు పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండవలసిన చోట చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించారని, చిరు వ్యాపారులు దానిని గమనించాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News