Monday, December 23, 2024

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎపి నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను మాదపూర్ ఎస్‌ఓటి, కొల్లూరు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 125కిలోల గంజాయి, కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి సందీప్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, అమరావతికి చెందిన కార్తిక్వ్రికిరణ్ దేశ్‌ముఖ్, కమల్ సంజయ్ సిర్‌సాత్, రాజాబాయి, ఎపిలోని విజయనగరం జిల్లాకు చెందిన రాజా అలియాస్ రాజేష్ పట్నాయక్ కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కార్తిక్, కమల్, రాజాబాయి గంజాయి రవాణాలో భాగస్వాములు.

ముగ్గురు కలిసి ఎపిలోని విజయనగరం జిల్లాకు చెందిన రాజా అలియాస్ రాజేష్ పట్నాయక్ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని అమరావతికి తరలిస్తున్నారు. ముగ్గురు నిందితులు విజయనగరం వచ్చి రూ.3,000లకు కిలో చొప్పున 125 కిలోలగు కొనుగోలు చేశారు. గంజాయిని ప్యాకెట్లలో నింపి వారి తీసుకుని వచ్చిన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారులో లోడ్ చేసుకున్నారు. అక్కడి నుంచి రాజాబాయ్ రైలులో మహారాష్ట్రకు వెళ్లిపోగా, మిగతా ఇద్దరు కారులో గంజాయి తీసుకుని బయలు దేరారు. నిందితులు మహారాష్ట్రకు వెళ్లేందు కొల్లురు ఓఆర్‌ఆర్ వద్దకు రాగానే పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు శివప్రసాద్, సంజయ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News