సిటిబ్యూరోః మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను టిఎస్ నాబ్, అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,464 నిట్రావెట్ ట్యాబ్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, బీదర్‌కు చెందిన బిర్జు ఉపాధ్యాయ్ అక్కడ బెల్టు షాప్ నిర్వహిస్తున్నాడు, నిట్రావెట్ ట్యాబ్లెట్స్ సప్లయ్ చేస్తున్నాడు, కిషన్ విట్టల్ రావు కాంబ్లే ట్యాబ్లెట్లు సప్లయ్ చేసేందుకు సహకరిస్తున్నాడు. బీదర్‌కు చెందిన బిర్జు ఉపాధ్యాయ్ వివిధ నేరాలు చేయడంతో పోలీసులు 13 కేసులు నమోదు చేసి రౌడీషీట్ పెట్టారు.
నిందితుడు తన కుటుంబంతో కలిసి గత 14 ఏళ్ల నుంచి నిట్రావెట్ ట్యాబ్లెట్లను హైదరాబాద్‌కు చెందిన పలువురికి విక్రయిస్తున్నారు. బీదర్, గుల్బార్గాలో తన సహాయకుడు కిషన్ విట్టల్ రావు సహకారంతో ట్యాబ్లెట్లను సేకరిస్తున్నాడు. గుల్బార్గాకు చెందిన సుప్రీత్ నవాలే వద్ద రూ.2,000 బాక్స్(300 ట్యాబ్లెట్స్) కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి రూ.5,500లకు విక్రయిస్తున్నారు. నిందితుడికి ఇద్దరు భార్యలు, కుమారుడు ఉన్నాడు. వారు, అత్తా రాణు బాయ్ సహకారంతో హైదరాబాద్‌కు మత్తు గోలీలు రవాణా చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని మాంగర్‌బస్తీలో ఉంటున్న రాజు, పల్లవికి సప్లయ్ చేస్తున్నాడు.
హబీబ్‌నగర్ పిఎస్ పరిధిలో…
ఈ నెల 4వ తేదీన మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న నాడే చక్రధారిని హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 11బాక్స్‌ల్లోని నిట్రావెట్ ట్యాబ్లెట్లు, 22 స్కఫ్ టానిక్‌లు, రూ.16,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న హెచ్‌న్యూ అధికారులు విచారణ చేయగా బీదర్ నుంచి మత్తు ట్యాబ్లెట్లు సఫరా చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే హెచ్‌న్యూ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు బీదర్‌కు వెళ్లారు.
పోలీసులపై దాడి….
మత్తు ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న వారిని పట్టుకునేందుకు వెళ్లిన వారిపై నిందతుడి కుటుంబ సభ్యులు దాడి చేశారు.దీంతో ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు బీదర్‌కు వెళ్లిన హైదరాబాద్ పోలీసులు అక్కడి గాంధీగంజ్‌కు చెందిన పోలీసుల సహకారం తీసుకున్నారు. నిందితుడి ఇంటిని గుర్తించిన పోలీసులు తెల్లవారుజామున 1 గంటలకు ఇంట్లోకి వెళ్లడంతో ఉపాధ్యాయ్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో ఎస్సై వెంకటరాములు, కానిస్టేబుల్ నవీన్‌కాంత్‌కు గాయాలయ్యాయి.