గంజాయి తీసుకుంటున్న ఎనిమిది మంది
6కిలోల గంజాయి, బైక్ స్వాధీనం
హైదరాబాద్: వ్యసనాలకు బానిసలుగా మారి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు, గంజాయి తీసుకుంటున్న ఎనిమిది మందిని నార్కోటిక్ వింగ్, అంబర్‌పేట పోలీసులు కలిసి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6కిలోల గంజాయి, రెండు మోటార్ సైకిళ్లు, రూ.2,500 నగదు, తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2,80,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, మంగళ్‌హాట్‌కు చెందిన రాహుల్ సింగ్ అలియాస్ గౌ గంజాయి, ధన్‌రాజ్ సింగ్ అలియాస్ ధనా కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. గంజాయి తీసుకుంటున్న భానుప్రసాద్, వినయ్ సునార్, తరుణ్, ప్రశాంత్, నిఖిల్, పవన్, పవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ సింగ్, ధన్‌రాజ్ ఇద్దరు కూలీ పనులు చేస్తున్నాడు. చేస్తున్న పనుల్లో వస్తున్న డబ్బులు వ్యసనాలకు సరిపోవడంలేదు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు.
మార్కెట్‌లో గంజాయికి డిమాండ్ హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండడంతో ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన జాడె శివకుమార్ అక్కడి నుంచి ఆర్టిసి బస్సులో గంజాయి నగరానికి తీసుకుని వచ్చి ఎల్‌బి నగర్‌లో ఇద్దరికి అందజేస్తున్నాడు. వీరు ఇద్దరు కలిసి ధన్‌రాజ్, రజితాబాయ్‌కి విక్రయిస్తున్నారు. వారు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు, చిరు వ్యాపారులకు గంజాయిని విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించేందుకు నిందితులు అంబర్‌పేటలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్లు రాజేష్, రమేష్ రెడ్డి, ఎస్సైలు జిఎస్ డానియల్, వెంకట రాములు తదితరులు పట్టుకున్నారు.