హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 10కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఒడిసా రాష్ట్రం, సంబల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి, మార్‌నగర్ గ్రామానికి చెందిన సమాసన్ భర్దన్ టేయిల్స్ ఫిటింగ్ పనిచేస్తున్నాడు. ఎపిలోని శ్రీకాకులం జిల్లా, బామిని మండలం, సోలికిరి కాలనీ, బాలేరకు గ్రామానికి చెందిన చింటాడా ప్రసాద్‌రాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒడిసాకు చెందిన అండ్రి అలియాస్ సాగర్ పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు అండ్రి ఒడిసా నుంచి గంజాయిని వివిధ ప్రాంతాలకు సప్లయ్ చేస్తున్నాడు.
శ్రీకాకులం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులో గంజాయి సరఫరా చేస్తున్నాడు. నిందితులు కిలోకు రూ.1,500కు కొనుగోలు చేసి నగరంలో రూ.7,000కు విక్రయిస్తున్నారు. పదికిలోల గంజాయిని నగరంలోని శ్యాంసన్ బర్దన్, చింటాడా ప్రసాద్‌రాజుకు ఇచ్చారు. నగరంలోని సరఫరా చేసేందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో వీరిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం తుకారాంగేట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్ తదితరులు పట్టుకున్నారు.