Wednesday, December 25, 2024

ఎంపి నామా కుమారుడిని బెదిరించిన కేసులో ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested in case of threatening MP Nama's son

పరారీలో మరో నిందితుడు
ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న నిందితులు
పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి దారి దోపిడీ చేసిన ఇద్దరు నిందితులను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎంపి నామా నాగేశ్వరరావు కుమారుడు జూబ్లీహిల్స్‌లో ఉంటున్న పృథ్వీ వ్యాపారం చేస్తున్నాడు. తన స్నేహితుడిని కలిసేందుకు గత నెల 30వ తేదీన కారులో టోలీచౌకీ మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తున్నాడు. ఇద్దరు యువకులు కారుకు బైక్‌ను అడ్డంగా పెట్టి ఆపివేశారు. మొబైల్ రిపేర్‌ఱ చేసే సల్మాన్, పనిలేకుండా తిరుగుతున్న జోయల్ కారులోకి ఎక్కారు. ఇద్దరు కారులోకి వచ్చి పృథ్వీ మెడపై కత్తిపెట్టి బెదిరించారు. వెంటనే బెదిరించి ఫోన్ పే ద్వారా రూ.75,000 ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. తాము చెప్పిన వైపు వెళ్లాలని బెదిరించి కారును కొండాపూర్ వైపు తీసుకుని వెళ్లారు. మార్గమద్యంలో ఇద్దరు నిందితులు వైన్‌షాపు వద్ద కారు ఆపి మద్యం కొనుగోలు చేశారు.

అక్కడి నుంచి కొండపూర్ వైపు వెళ్తుండగా దారిలో మరో వ్యక్తి కారులోకి ఎక్కాడు. ముగ్గురు కలిసి కారులోనే పృథ్వీపై పిడిగుద్దులతో దాడి చేస్తూ గచ్చిబౌలి, టోలిచౌకి, మెహిదీపట్నం మీదుగా ఎస్‌ఆర్ నగర్‌వైపు వెళ్లారు. ఈ క్రమంలో ఎస్‌ఆర్ నగర్‌లో ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టి తిరిగి పంజాగుట్ట వైపు వెళ్తుండగా నిమ్స్ వద్ద పృథ్వీ కారు నుంచి దూకేశాడు. అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత నిందితులు కారును వదిలేసి పారిపోయారు. అనంతరం పృథ్వీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్ హరీష్ చంద్రారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News