మనతెలంగాణ, హైదరాబాద్ : నకిలీ ఫింగర్ ప్రింట్లతో హాజరు వేస్తున్న ఇద్దరు జిహెచ్‌ఎంసి సూపర్‌వైజర్, వర్కర్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 24 నకిలీ ఫింగర్ ప్రింట్లు, అటెండెన్స్ మిషన్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అత్తాపూర్‌కు చెందిన రుద్రాజు ప్రభాకర్ జిహెచ్‌ఎంసిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. హైదర్‌గూడకు చెందిన రాజేష్ శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు నిందితులు ఖైరతాబాద్ సర్కిల్‌లో పనిచేస్తున్నాడు.
వీరి సర్కిల్‌లో పనిచేస్తున్న 20మంది శానిటేషన్ సిబ్బంది ఫింగర్ ప్రింట్లను తయారు చేశారు. విధులకు హాజరు కాని వర్కర్ల హాజరును వారి నకిలీ ఫింగర్ ప్రింట్లతో వేసి వచ్చినట్లు చూపిస్తున్నారు. నెల తర్వాత వారికి హాజరుకాని రోజుల జీతాన్ని తీసుకుంటున్నారు. రోజు కనీసం ముగ్గురు నుంచి నలుగురు శానిటరీ వర్కర్లు విధులకు హాజరు కావడంలేదు. వారి వేతనాలను ఇద్దరు నిందితులు తీసుకుంటున్నారు. ఇలా ఇద్దరు నిందితులు గత మూడేళ్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ ఎండి ఖలీల్‌పాషా, ఎస్సైలు రంజిత్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.