Saturday, November 23, 2024

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 22కి చేరింది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డాక్యా నాయక్ బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ. 1.75 లక్షల గురించి ఆరా అధికారులు ఆరా తీశారు. ఆ మొత్తం కోస్గి భగవంత్ అనే వ్యక్తి నుంచి డాక్యా నాయక్ ఖాతాకు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కోస్గి భగవంత్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఎంపిడివో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కోస్గి భగవంత్ తమ్ముడు కోస్గి రవికుమార్ కూడా ఏఇ పరీక్ష రాశాడు. ఈ క్రమంలోనే ఏఇ పేపర్ కొనుగోలు కోసం డాక్యా నాయక్‌కు భగవంత్ డబ్బులు లక్షలు చెల్లించినట్టుగా పోలీసులు గుర్తించారు.

దీంతో సిట్ అధికారులు కోస్గి భగవంత్, కోస్గి రవిలను అరెస్ట్ చేశారు. ‘తన సోదరుడు రవి కోసం భగవంత్.. 1.75 లక్షలు చెల్లించి డాక్యా నాయక్ నుంచి ప్రశ్నపత్రాన్ని పొందాడ’ ని సిట్ అధికారులు వెల్లడించారు. ఇక, కోస్గి భగవంత్, కోస్గి రవిలను సిట్ అధికారులు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చారు. దీంతో వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో మరింత మంది అనుమానితులను ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది. డాక్యా నాయక్ ఇతర నిందితుల బ్యాంకు అకౌంట్లు సెల్‌ఫోన్ డాటా ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నిందితుల మధ్య ఇప్పటి వరకు 33.4 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని డాక్యానాయక్‌కు అందించినట్టు వెల్లడైంది. కొందరు నేరుగా నగదు ఇస్తే మరికొందరు ఆన్‌లైన్ టాన్సాక్షన్స్ చేసినట్టు నిర్దారించారు.
ఎవరెవరికి ఎంతెంత…!?
ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కుమార్‌కు 16 లక్షలు రూపాయలు అందాయి. అతను ఏఇ పేపర్‌ను రేణుకా రాథోడ్‌కు అమ్మాడు. సోదరుడు రాజేశ్వర్ కోసం దీన్ని కొనుగోలు చేసింది. తర్వాత రాజేశ్వర్, డాక్యా నాయక్ కలిసి ఆ పేపర్‌ను మరో ఐదుగురికి బేరం పెట్టారు. ఈ ఐదుగురిలో నిలేశ్ నాయక్ 4.95 లక్షలు, గోపాల్ నాయక్ 8 లక్షలు, ప్రశాంత్ రెడ్డి 7.5 లక్షలు, రాజేంద్రకుమార్ 5 లక్షలు, వెంకట జనార్దన్ 1.95 లక్షలు ఇలా 27.4 లక్షలు ముట్టజెప్పారు. ఇందులో పది లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చారు. డిఎవో పేపర్‌ను ఖమ్మంలో ఉంటున్న సాయిలౌకిక్, సాయిసుస్మితకు ఆరు లక్షలకు ప్రవీణ్ అమ్మాడు. దీంతో రెండు పేపర్లు అమ్మినందుకు ప్రవీణ్‌కు 16 లక్షలు వచ్చాయి. డాక్యానాయక్, రాజేశ్వర్‌కు 17.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు.

వచ్చిన డబ్బులతో రాజేశ్వర్ కొన్ని కాంట్రాక్ట్ పనులు చేశాడని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. మన్సూ ర్‌పల్లి తండాలో వీధిలైట్లు ఫిట్ చేయడం, డ్రైనేజీ పనులు పూర్తి చేశాడు. 4.5 లక్షలతో అప్పులు తీర్చాడు. మిగతా ఇద్దరు నిందితులు ప్రవీణ్, డాక్యానాయక్ మాత్రం తమ అమౌంట్‌ను బ్యాంకులోనే ఉంచుకున్నారు. ప్రవీణ్ తన దగ్గర బంధువుకు అప్పుగా కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు నివే దికలో పేర్కొన్నారు. మరో నిందితుడి రాజశేఖర్‌రెడ్డి మాత్రం బావ కళ్లల్లో ఆనందం కోసం గ్రూప్ 1 పేపర్‌ను ఉచితంగా ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఆయనతోపాటు టిఎస్‌పిఎస్‌సిలో ఉద్యోగి అయిన షమీమ్‌కు కూడా ఫ్రీగానే పేపర్ ఇచ్చాడు. ప్రవీణ్ కూడా గ్రూప్ 1 పేపర్‌ను సురేష్, రమేష్‌కు ఉచితంగా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News