పిల్లాడిని తల్లికి అప్పగించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎసిపి శివమారుతి
హైదరాబాద్: తల్లి పక్కన నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలను హుమాయున్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్‌నగర్ ఎసిపి శివమారుతి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శబానా బేగం ఇద్దరు పిల్లలతో కలిసి బెగ్గింగ్ చేసి ఫుట్‌పాత్ సమీపంలోని పిల్లర్ నంబర్ 13,14 వద్ద నిద్రిస్తుంది.
ఈ నెల 6వ తేదీన యువతి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించింది. తెల్లవారుజామున 2.30 గంటలకు లేచి చూసేసరికి బాలుడు ఎండి రహీం(14) కన్పించ లేదు. వెంటనే సమీపంలోని ప్రాంతాలను వెతికినా కూడా ఆచూకీ లభించలేదు. దీంతో హుమాయున్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి రంగారెడ్డి జిల్లా, పెద్దిమాల్ మండలం, జనగాం గ్రామానికి చెందిన శ్రీవతి దస్తమ్మ, వికారాబాద్, మోమిన్‌పేటకు చెందిన మోడెం లక్ష్మిని అరెస్టు చేశారు.
ఇద్దరు భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫుట్‌పాత్‌పై తల్లి పక్కన నిద్రిస్తున్న బాలుడిని చూశారు. బాలుడిని చూపించి బెగ్గింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ప్లాన్ వేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి వారితో తీసుకుని వెళ్లారు. సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ నారాయణరెడ్డి, ఎస్సై వినోద్‌కుమార్, పిసిలు కరణాకర్ గౌడ్, వినయ్, రాకేష్ తదితరులు పట్టుకున్నారు.