Thursday, January 23, 2025

రంజీ మ్యాచ్ లో వింత: ముంబయి VS రెండు బీహార్ జట్లు!

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ టోర్నమెంటు జనవరి 5న మొదలు కాగా, మొదటిరోజే క్రికెట్ పరువు తీసే సంఘటన చోటు చేసుకుంది. ముంబయితో జరగవలసిన మ్యాచ్ కోసం రెండు బీహార్ జట్లు గ్రౌండులోకి దిగాయి. దాంతో ప్రేక్షకులతోపాటు ముంబయి జట్టు ఆటగాళ్లు కూడా బిత్తరపోయారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో మ్యాచ్ ఆలస్యంగా మధ్యాహ్నం ఒంటిగంటకు  ప్రారంభమైంది. ఈ గందరగోళానికి బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బిసిఏ) అధ్యక్షుడు, కార్యదర్శికి మధ్య నెలకొన్న గొడవలే కారణం.

పట్నాలోని మొయినుల్ హక్ స్టేడియంలో ముంబయి-బీహార్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం ఏర్పాట్లు జరిగాయి. శుక్రవారం మ్యాచ్ మొదలుకావలసి ఉండగా, బీహార్ తరపున రెండు జట్లు గ్రౌండుకు వచ్చాయి. ఇందులో ఒక జట్టును బిసిఏ అధ్యక్షుడు రాకేశ్ తివారీ ఎంపిక చేయగా, రెండో జట్టును కార్యదర్శి అమిత్ కుమార్ ఎంపిక చేశారు. అసలైన బీహార్ జట్టు మాదంటే మాదేనంటూ అధ్యక్ష కార్యదర్శులు గొడవకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పడంతో మ్యాచ్  ఒంటిగంటకు మొదలైంది. అధ్యక్షుడు తివారీకి చెందిన జట్టే చివరకు బరిలోకి దిగింది.

మ్యాచ్ మొదలయ్యాక బీసిఏ అధ్యక్షుడు తివారీ విలేఖరులతో మాట్లాడుతూ కార్యదర్శిని తాము సస్పెండ్ చేశామనీ, కాబట్టి అతను  జట్టును ఎంపిక చేయడం చెల్లదని అన్నారు. తాను ఆటగాళ్ల ప్రతిభాపాటవాల ఆధారంగా జట్టును ఎంపిక చేశానని చెప్పుకున్నారు. కార్యదర్శి అమిత్ కుమార్ మాట్లాడుతూ తనను సస్పెండ్ చేసే అధికారం అధ్యక్షుడికి లేదన్నారు. జట్టును కార్యదర్శే ఎంపిక చేస్తాడని, అధ్యక్షుడికి ఆ హక్కు లేదని ఆయన వాదించారు. టీమిండియా ఆటగాళ్ల పేర్లను బిసిసిఐ కార్యదర్శే ప్రకటిస్తారని, అంతే తప్ప అధ్యక్షుడు ప్రకటించడం ఎప్పుడైనా చూశారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, శుక్రవారం ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు తొలి రోజు తొమ్మిది వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. అతను కేవలం 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News