అగర్తల: త్రిపురకు చెందిన ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ సభ్యత్వంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశీష్ సహా సోమవారం ఉదయం అసెంబ్లీ స్పీకకర్ రతన్ చక్రవర్తిని కలసి తమ రాజీనామా లేఖలను అందచేశారు. రాయ్ బర్మ, సహా తనను కలసి రాజీనామా లేఖలు సమర్పించారని, రాజీనామా లేఖలు అసెంబ్లీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించవలసిందిగా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించానని స్పీకర్ చక్రవర్తి తెలిపారు. తాము న్యూఢిల్లీకి వెళ్లి తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని రాయ్ బర్మన్ విలేకరులకు తెలిపారు. వారిద్దరూ మంగళవారం కాంగ్రెస్‌లో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేయడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రాజీనామా చేసి తాను విముక్తి పొందానని మాజీ ఆరోగ్య మంత్రి అయిన రాయ్ బర్మన్ అన్నారు. త్రిపురలో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, ఎవరికీ మాట్లాడే హక్కు కూడా లేదని ఆయన ఆరోపించారు.