Sunday, January 19, 2025

కంటి చూపులేకున్నా లక్షసాధనలో మిన్న

- Advertisement -
- Advertisement -

సిమ్లా : దృష్టి లోపంతో బాధపడుతున్నప్పటికీ తాము అనుకున్న లక్షాలను సాధించి సిమ్లా లోని రెండు యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఇద్దరు అంధమహిళలు నియమితులయ్యారు. దృష్టి లోపం తమ లక్షసాధనకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు. ముస్కాన్, ప్రతిభా ఠాకూర్ అనే ఇద్దరు అంధమహిళలు ఇటువంటి వారికెందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచారు. ముస్కాన్ సిమ్లా జిల్లా కు చెందిన అంబికా దేవీ, జయ్‌చంద్ దంపతుల కుమార్తె. రైతుకుటుంబానికి చెందిన ముస్కాన్ పుట్టుకతోనే అంధురాలు. తన వైకల్యం తల్లిదండ్రులకు భారం కాకూడదని స్వయం శక్తితో రాణించాలని నిశ్చయించుకన్నారు. కుల్లులో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. పోర్ట్‌మోర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీనియర్ సెకండరీ విద్యను పూర్తి చేశారు.

2013లో రాజ్‌కియా కన్యా మహావిద్యాలయ యూనివర్శిటీలో ప్రవేశం లభించిన ఐదుగురు అంధబాలికల్లో ముస్కాన్ ఒకరు. ఆ కాలేజీ 70 ఏళ్ల చరిత్రలో అంధవిద్యార్థులకు ప్రవేశం లభించడం అదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం మ్యూజిక్‌లో డాక్టరేట్ చేస్తున్న ముస్కాన్ గాయనిగా గుర్తింపు పొంది గతంలో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆమెను హిమాచల్ ప్రదేశ్ యూత్ ఐకాన్‌గా ఎంపిక చేసింది. ఆర్‌కేఎంవీ యూనివర్శిటీలో మ్యూజిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. “ నా పోరాటం ఫలించింది. మ్యూజిక్ ప్రొఫెసర్ కావాలని చిరకాలంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సరైన మార్గంలో వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది ” అని ఆమె తన మనసులో మాట వెలిబుచ్చారు.

మరో అంధ మహిళ ప్రతిభా ఠాకూర్ గతంలో ఓ విద్యాసంస్థలో ప్రవేశానికి నిరాకరణకు గురయ్యారు. అయినా తాజాగా అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశం లభించింది. జర్నలిస్ట్ ఖేమ్ చంద్రశాస్త్రి , సవితా కుమారి దంపతుల కుమార్తె ప్రతిభా ఠాకూర్ హిమాచల్ మండీ జిల్లా మతక్ గ్రామానికి చెందిన వారు. ఐదో తరగతి వరకూ ఇంటివద్దే చదువుకున్న ఠాకూర్ ఆరోతరగతిలో పాఠశాలలో ప్రవేశించారు. అప్పటినుంచి చదువుల్లో రాణిస్తూ వచ్చారు. పరీక్షల్లో ప్రతిసారీ మొదటిస్థానం వచ్చేది. రక్తదానంలో ముందుండే ప్రతిభా ఠాకూర్ కవిత్వ, సాహిత్య పోటీల్లోనూ పాల్గొనే వారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. పాలన, అంతర్జాతీయ వ్యవహారాలపై ఎంతో ఆసక్తి.

తన తల్లే తనకు స్ఫూర్తి అని చెబుతున్నారు. ఉపాధ్యాయురాలు కావాలన్న కోరిక ఉన్నా ఒకటో తరగతి లోనే అడ్మిషన్ నిరాకరించారని ఠాకూర్ చెప్పారు. వెనుకబడిన విద్యార్థులను తీర్చి దిద్దడమే తన లక్షంగా ఆమె చెబుతున్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేసే ఉమంగ్ అనే స్వచ్ఛంద సంస్థలో ముస్కాన్, ప్రతిభా ఠాకూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారానే ముస్కాన్‌కు మెరిట్ స్కాలర్ షిప్ లభించింది. అంధత్వం ఉన్నా సాధ్యం కానిదేదీ తమకు లేదని ఈ ఇద్దరు అంధమహిళలు నిరూపించారని ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ శ్రీ వెల్లడించారు. సరైన ప్రోత్సాహం లభిస్తే వీరు మరెన్నో విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News