జోర్హత్: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో బుధవారం రెండు పడవలు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 60మంది గల్లంతయ్యారు. జోర్హత్ జిల్లాలోని నిమతిఘాట్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. రెండు పడవల్లో కలిపి మొత్తం 120మంది ప్రయాణికులున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి 42మందిని కాపాడినట్టు జోర్హత్ డిప్యూటీ కమిషనర్ అశోక్‌బర్మన్ తెలిపారు. గల్లంతైనవారి కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. మా కమల అనే ప్రైవేట్ పడవ నిమతిఘాట్ నుంచి మజులివైపు వెళ్తుండగా, త్రిప్కాయి అనే ప్రభుత్వ పడవ మజులివైపు వస్తుండగా ఒకదానికొకటి ఎదురుపడి డీకొన్నాయి. ఈ ప్రమాదంలో మా కమల పూర్తిగా నీట మునిగినట్టు అధికారులు తెలిపారు. ఈ పడవలో 85మంది ప్రయాణికులతోపాటు ఫోర్‌వీలర్,టూవీలర్ వాహనాలున్నాయని వారు తెలిపారు. ఈ దుర్ఘటన పట్ల అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా మజులి, జోర్హత్ జిల్లాల అధికారులను శర్మ ఆదేశించారు. గురువారం ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి వెళ్తారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదం పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధితుల రక్షణ కోసం వీలైన అన్ని చర్యలూ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.