సాగర్ కాలువలో ఈతకోసం వెళ్ళీన ఇద్దరు బాలురు ఈత రాక మృత్యువడిలోకి చేరుకున్నారు. ఖమ్మం నగరంలో త్రీటౌన్‌లోని గాంధీ చౌక్ ప్రాంత నివాసి అన్నం సుబ్బారావు, -రేణుకా దంపతుల కుమారుడు కిరణ్ తేజ (16 ) , పంపింగ్ వేల్ ప్రాంతానికి చెందిన కూచిపూడి ముద్దు కృష్ణ-, అర్చనల కుమారుడు బెన్విత్(16 ) ఇద్దరు బాలురు మంచి స్నేహితులు. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశారు. వేసవి సెలవులు కావడంతో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో క్రికెట్ అడుకుంటామని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి దానవాయి గూడెం వద్ద మున్నేరు చెక్ డ్యామ్ సమీపంలోని సాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్ళి ఈత రాక ప్రమాదవశాత్తు నీళ్ళలో మునిగి గల్లంతయ్యారు.
సమాచారం తెలిసిన వెంటనే స్థానిక గజ ఈతగాళ్ళు డిఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం అందించి వారి సేవలను వినియోగించినప్పటికి వారిని రక్షించలేకపోయారు. పోలీసులు గజఈతగాళ్లతో గాలించి మృతదేహాలను బయటకు తీసి మృతదేహలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఇరు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ బాలురుల మ్రతదేహాలను సందర్శించి నివాళ్లులర్పించారు.