Wednesday, January 22, 2025

నేడో,రేపో కాంగ్రెస్‌లోకి ఇద్దరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :కాంగ్రెస్‌లో ఇద్దరు బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నేడు లేదా రేపు చేరే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంలో ఇప్పటి కే సంప్రదింపులు జరిగాయని వారి చేరికకు సంబంధించి గ్రీన్‌సిగ్నల్ సైతం వచ్చినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలె యాదయ్య హస్తం తీర్థం పుచ్చుకోగా తాజాగా అదేబాటలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు సైతం సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఈ రెండు రోజుల్లో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టుగా సమాచారం. వచ్చే ఏడాది బస్వరాజ్ సారయ్య రిటైర్ కాబోతున్నారు. ఆయనకు రెన్యూవల్ కోసం కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సారయ్యతో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో సైతం కాంగ్రెస్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నలుగురే….
ప్రస్తుతం కాంగ్రెస్‌కు అసెంబ్లీలో సరిపడా బలం ఉండటంతో ఈ సారి మండలిపై దృష్టి పెట్టింది. కీలక బిల్లులు పాస్ కావాలంటే మండలిలోనూ మెజార్టీ సభ్యులు కావాలి. కానీ, 40 మంది సభ్యులున్న శాసన మండలిలో కాంగ్రెస్ బలం కేవలం నలుగురే. 21 మంది సభ్యులుంటే ఈజీగా బిల్లులు పాసయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించినట్టు సమాచారం. 40 మంది ఎమ్మెల్సీలు ఉన్న శాసన మండలిలో కాంగ్రెస్ బలం నాలుగు మాత్రమే. 2019 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టి.జీవన్ రెడ్డి కొనసాగుతుండగా, తాజాగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల సెగ్మెంట్ నుంచి ఇటీవలే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. ఎంఐఎం, బిజెపిలకు ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు. మిగతా 34 మంది బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, బస్వరాజ్ సారయ్యలతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఈ రెండు రోజుల్లో బండ ప్రకాశ్, బస్వరాజ్ సారయ్యలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. వీరితో పాటు బుగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుండటంతో వారిని కూడా కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News