మొబైల్స్ స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్ నగర్ ఎసిపి వైవి రావు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, నాంపల్లి దర్గాకు చెందిన సయిద్ వాజిద్ అలియాస్ సయిద్ నాన్న పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అమీర్ సోహైల్ వాల్ పేయింటింగ్ పనిచేస్తున్నాడు.
మలక్‌పేటకు చెందిన తబ్రేజ్ ఖాన్ ఎస్‌ఆర్ నగర్ మెట్రో వద్ద కారులో ఉండి మొబైల్‌ను చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి విండోలో నుంచి చేతిని పెట్టి మొబైల్‌ను స్నాచింగ్ చేసి పారిపోయారు. దీంతో బాధితుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. డిఐ రఘురాములు, డిఎస్సై సూరజ్ తదితరులు కేసు దర్యాప్తు చేశారు.