అరుణాచల్ ప్రదేశ్‌లో ఘటన
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లోని టిరప్ జిల్లాలో ఇద్దరు పౌరులు సైన్యం ”పొరపాటుకు” గాయాలపాలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఛాసా గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. నదిలో చేపలు పట్టి ఇద్దరు గ్రామస్తులు తిరిగివస్తుండగా సైనిక జవాన్లు వారిపై పొరపాటున కాల్పులు జరిపారు. వారిని నాక్ఫియా వాంగ్‌దన్(28), రామ్‌వాంగ్ వాంగ్సు(23)గా గుర్తించారు. ఇద్దరిలో ఒకరి చేతికట్టుకు గాయం కాగా మరొకరి పాదానికి గాయమైందని అస్సాం మెడికల్ కాలేజ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత్ దిహింగియా తెలిపారు. ఇద్దరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు. కాగా.. సైనిక జవాన్ల చర్యలపై బిజెపి తిరప్ జిల్లా అధ్యక్షుడు కామరంగ్ టెసియా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు రక్షణ ఇవ్వాల్సిన సైనికులే తమ అనాలోచిత చర్యల వల్ల వారి ప్రాణాలు తీస్తూ తమ విశ్వసనీయతను కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు.