ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు తనపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు కావడంతో భయంతో పోలీస్ స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల 17వ బెటాలియన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ అప్పుల బాధతో కుటుంబ సభ్యులతో సహా ఎలుకల ముందు కలిపిన తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణం, కల్వకుంట కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సిఐ వాసుదేవరావు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓ ప్రైవేట్ కంపెనీలో 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి అందులో నష్టం రావడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పును తీర్చే మార్గం లేక కుటుంబ సభ్యులతో సహా సిద్దిపేట పట్టణం కాలకుంట కాలనీకి చెందిన బండారి బాలకృష్ణ (34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రోజులాగే శనివారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన బాలకృష్ణ రాత్రి 11 గంటల సమయంలో తన భార్య మానసతో ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం కోసం తనకు 25 లక్షల రూపాయలు అప్పు అయిందని,
అది తీర్చే మార్గం లేదని అప్పులవారు ఇంటి మీదకి వచ్చి గొడవ చేయకముందే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మంచిదని చెప్పాడు. అనంతరం తన భార్యకు టీ పెట్టమని చెప్పి, టీ తెచ్చాక తన వెంట తెచ్చిన ఎలుకల మందు పౌడర్‌ను టీలో కలిపి భార్యతో పాటు కుమారులు యశ్వంత్, అశ్విత్‌లకు ఇచ్చాడు. అది తాగి అందరూ నిద్రపోగా, తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాలకృష్ణతో అతని భార్యకు మెలకువ వచ్చింది. పిల్లలతో సహా ఎవరికీ ఏమీ కాకపోవడంతో మెలకువలోకి వచ్చిన బాలకృష్ణ తన భార్య చీరను తీసుకొని పక్కనే వేరే గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. గమనించిన అతని భార్య బాలకృష్ణ తమ్ముడు సాయితో పాటు తన తమ్ముడు శ్రీశైలం లకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని డోర్ పగులగొట్టి, బాలకృష్ణ మృతదేహాన్ని కిందకు దించి, పోలీసులకు సమాచారం అందించి, 108 సహాయంతో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా, బాలకృష్ణ భార్య, పిల్లలు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పోందుతుండగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
అదేవిధంగా మెదక్ జిల్లా, కొల్చారం ఠాణాలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సాయి కుమార్ ఆదివారం ఉదయం 7=8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1992 బ్యాచ్‌కు చెందిన సాయి కుమార్‌కు ముగ్గురు అన్నదమ్ములు. అతని మేనమామ దగ్గర చదువుకున్న క్రమంలో తొందరగానే జాబ్ రావడం, అనంతరం హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్, నర్సాపూర్ కౌడిపల్లి వివిధ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ, సంవత్సరం క్రితం కొల్చారం హెడ్‌కానిస్టేబుల్‌గా బదిలీపై వచ్చాడు. ఉదయం టీ తాగడానికి వెళ్లి, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు తెలిపినట్లు సమాచారం. ఘటన స్థలాన్ని మెదక్ రూరల్ సిఐ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, మృతుడు హెడ్‌కానిస్టేబుల్ సాయికుమార్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిఫిన్ సెంటర్ నడిపే ఒక ఎస్‌సి మహిళకు డబ్బులు ఇచ్చాడని తెలిసింది.
ఆ డబ్బులు త్వరగా ఇవ్వాలని సున్నితంగా అడిగినా అతనిపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు చేయాలని, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిందని తెలిసింది. దీనిపై విచారణ జరపాలని ఎస్పీ పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్టు భోగట్టా. అదేవిధంగా డబ్బులు తీసుకున్న మహిళ, సాయి కుమార్ మధ్య వివాహేతర సంబంధం కూడా కొనసాగినట్లు పలువురు అనుమానిస్తున్నారు.