తెలంగాణ జిల్లాల్లో మూడు రోజుల వడగాలులు…
హెచ్చరించిన వాతావరణశాఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఎండలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా మూడు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం నుంచే మాడుపగిలేలా ఎండలు దంచికొడుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాగల మూడురోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో రాత్రిళ్లు వేడిగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ ఒకటిన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
పలు జిల్లాల్లో రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు ఉండడంతో వేడిగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 2న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో అక్కడక్కడ వేడిగాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది.