Monday, December 23, 2024

మోరంచవాగులో రెండు మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: నేరాలు చేస్తే లాఠీలు చేత పట్టుకొని కఠినంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఆపత్కాల సమయంలో మేమున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం భరోసా కల్పించింది. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి మొరంచవాగు ఉగ్రరూపాన్ని దాల్చింది. దీంతో మోరంచపల్లి గ్రామం మీదుగా భారీ వరద రావడంతో అక్కడి ప్రజలు సర్వస్వాన్ని కోల్పోయారు. వరద ప్రవాహంలో పశువులు, కొంత మంది ప్రజలు కొట్టుకుపోయి ప్రాణాలను కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీస్ యంత్రాంగం డిఎస్‌పి రాములు నేతృత్వంలో శుక్రవారం నుంచి ప్రత్యేక బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టారు.

సెర్చ్ ఆపరేషన్ ద్వారా డ్రోన్ కెమెరాల సహాయంతో తాజాగా శనివారం రెండు మృతదేహాలను గుర్తించారు. చిట్యాల మండలంలోని ఒడితల శివారు ప్రాంతంలో మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్ర ఒదిరెడ్డి (70), ఎస్‌ఎం కొత్తపల్లి శివారు సోల్‌పేట తాళ్ళ శివారులో గంగిడి సరోజన మృతదేహాలను గుర్తించారు. అయితే మృతదేహాలు పూర్తిగా కుళ్లి పోవడంతో బయటకు తీసుకురావడానికి స్థానికులు ఎవరు ముందుకు రాలేదు. దీంతో భూపాలపల్లి సిఐ రామ్ నర్సింహారెడ్డి, చిట్యాల ఎస్‌ఐ రమేష్ వరద నీటిలో నుండి మృతదేహాలను భుజాన ఎత్తుకొని ఒడ్డుపైకి తీసుకొచ్చి సహృదయతను చాటుకున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరును ప్రజలు సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ సలాం భూపాలపల్లి పోలీస్ అంటూ కొనియాడుతున్నారు.
మిగతా రెండు మృతదేహాల కోసం గాలింపు
మొరంచవాగులో గల్లంతయిన మిగతా రెండు మృతదేహాల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు గాలింపు చర్యలను చేపడుతున్నారని జిల్లా ఎస్‌పి పుల్ల కరుణాకర్ తెలిపారు. ఖచ్చితంగా మిగతా రెండు మృతదేహాలను వెలికి తీస్తామని కుటుంబ సభ్యులు అధైర్యపడద్దని భరోసాను కల్పించారు. గజ ఈతగాళ్లను సైతం రంగంలోకి దించామని డ్రోన్ కెమెరాల సహాయంతో సైతం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం గ్రూపులుగా విడిపోయి సహాయ, సహాకారాలు అందిస్తామని తెలిపారు. ఈ గాలింపు చర్యల్లో చిట్యాల సిఐ వేణుచందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News