రాంచీ ఘర్షణలలో ఇద్దరు మృతి
కొన్ని ప్రాంతాలలో కర్ఫూ విధింపు
ప్రవక్తపై వ్యాఖ్యలతో తీవ్ర ఉద్రిక్తతలు
హౌరాలో పోలీసులతో తలపడ్డ నిరసనకారులు
రాంచీ/ కొల్‌కతా : మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో కొనసాగుతోన్న నిరసనలతో లో శనివారం జార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, యుపిలో పలు ప్రాంతాలలో తీవ్రస్థాయి ఉద్రిక్తత నెలకొంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిరసనకారులు , పోలీసుల మధ్య ఉదయం పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఈ దశలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు శనివారం తెలిపారు. రాంచీలో పలుచోట్ల కర్ఫూ విధించారు. పలు ప్రాంతాలలో నిరసనలకు దిగిన వారిని చెదరగొట్టేందకు లాఠీచార్జి జరిపారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పంచాలా బజార్ ప్రాంతంలో పోలీసులు, నిరసనకారులు రాళ్లతో తలపడ్డారు. రఘుదేవ్‌పూర్‌లో బిజెపి కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇక్కడ పూర్తిస్థాయిలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే వీటిని పట్టించుకోకుండానే నిరసనకారులు పలు చోట్ల ధర్నాకు దిగారు. పలు ప్రాంతాలలో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
యుపిలో రంగంలోకి దిగిన బుల్‌డోజర్లు
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సహ్రాన్‌పూర్ నగరంలో శనివారం పోలీసులు తమ వెంట భారీ బుల్‌డోజర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి వీధులలో కలియతిరిగారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతంగా మారుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వారి నివాసాలను గుర్తించి వాటిని కూలగొట్టారు. ఇక్కడ మొత్తం 64 మందిని అరెస్టు చేశారని జిల్లా పోలీసు అధికారి తెలిపారు. వరుస ఘర్షణలలో నిందితులుగా ఉన్న ముజామ్మిల్, అబ్దుల్ వఖీర్‌ల నివాసాలు బుల్‌డోజర్ల ధాటికి కుప్పకూలుతూ ఉండటం, పోలీసు బలగాలు , మున్సిపల్ సిబ్బంది నిలబడి ఉండటం తెలిపే వీడియోలు వెలువడ్డాయి. వీరి నివాసాలు అక్రమ నిర్మాణాలని తేలిందని పైగా ఘర్షణలకు ఈ నివాసాలు కేంద్రంగా ఉన్నాయనే నిర్థారణకు రావడంతోనే కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని నగరాలలో ల్యాండ్ మాఫియాలు రంగంలోకి దిగాయని, ప్రస్తుత వివాదాన్ని సాకుగా తీసుకుని ఘర్షణలకు వ్యూహరచన చేస్తున్నారని ఈ విధంగా తయారయిన సంఘు విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సిఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. ఈ విషయంలో అధికారులకు , పోలీసు విభాగానికి పూర్తిస్థాయి అధికారం కల్పిస్తున్నట్లు సిఎం తరఫున ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.