నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవిలోని సలేశ్వరం లింగమయ్య జాతరలో అపశృతి చోటుచేసుకుంది. లింగమయ్య దర్శనానికి కాలి నడకన వచ్చిన ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతి చెందారు. మృతుల్లో నాగర్‌కర్నూల్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు చంద్రయ్య(55), రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన విజయ (40) మహిళ ఉన్నారు. లోయలోకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఆయాసంతో వీరిద్దరు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తొక్కిసలాట కాని, ఊపిరాడకపోవడం వల్ల కాని వీరు చనిపోలేదని గుండెపోటుతో మృతి చెందారని నాగర్‌కర్నూల్ ఎస్పి కె. మనోహర్ తెలిపారు. ఇద్దరు భక్తులు మృతి చెందిన విషయం ఆ నోట ఈనోట వ్యాప్తి చెందడంతో సలేశ్వరం క్షేత్రంలో ఉన్న భక్తుల్లో ఒక్కసారిగా అలజడి రేగినట్లు ప్రత్యేక సాక్షులు తెలిపారు. ఇదే క్రమంలో స్వల్పంగా తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో వనపర్తికి చెందిన అభిషేక్ అనే యువకుడు కూడా గాయపడి అస్వస్థతకు లోనైనట్లు సమాచారం.
వరుస సెలవులు, పౌర్ణమితో భక్తుల రద్దీ
వరుసగా శుక్ర, శని, ఆది వారాలు సెలవు దినాలు కావడం, దీనికి తోడు పౌర్ణమి రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదే విధంగా మూడు రోజులు నిబంధన అమలులో ఉండడంతో సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్రాబాద్ మండలం ఫరహాబాద్ దారి నుంచి సలేశ్వరం క్షేత్రం వరకు జనం కిక్కిరిసిపోయారు. దీనికి తోడు శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాలు భారీఎత్తున బారులు తీరాయి. రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటవీ శాఖ అధికారులు మూడు రోజులు మాత్రమే లింగమయ్య దర్శనానికి అనుమతి ఇవ్వడంతో భక్తులు పోటెత్తారు. గతంలో 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహించేవారు
. రెండేళ్లపాటు కరోనా సమయంలో యాత్రను రద్దు చేయడం, ఆ తదుపరి లింగమయ్య దర్శనానికి అనుమతులు ఇవ్వడంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వస్తుండడం సలేశ్వర క్షేత్రంలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉండడంతో 50 శాతానికి పైగా భక్తులు లింగమయ్యను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మరో మూడు రోజుల పాటు భక్తులకు అనుమతులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.