న్యూఢిల్లీ: విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోదనను చూసి చలించిన విమానంలోని ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఆ విమానం రాంచీనుంచి ఢిల్లీ బయలుదేరింది. 20 నిమిషాల తర్వాత విమానం గాలిలో ఉండగా పుట్టుకతోనే గుండె సమస్య ఉన్న పసిబిడ్డ పరిస్థితి విషమించింది. ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడింది. తల్లి ఆందోళన చెందడంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సాయం చేయాలని సిబ్బంది ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కాగా జార్ఖండ్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ నితిన్ కులకర్ణి, రాంచీలోని సదర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ మొజమిల్ ఫెరోజ్ ఆ చిన్నారని రక్షించేందుకు ముందుకు వచ్చారు.
పిల్లల మాస్క్ లేకపోవడంతో పెద్దల మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న ఇంజక్షన్ ఇచ్చారు. పుట్టుకనుంచి గుండె సమస్య ఉన్న ఆ చిన్నారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లున్నట్లు తెలుసుకున్నారు. మరోవైపు విమానం ల్యాండింగ్ తర్వాత తక్షణ వైద్యసాయానికి ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆ ఇద్దరు డాక్టర్లు కోరారు. దీంతో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే పూర్తి మెడికల్ సపోర్టు ఉన్న అంబులెన్స్‌లో ఆ పసిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. దాదాపు గంట సేపు తాము అందించిన వైద్య సహాయం పట్ల తమకు ఎంతో సంతృప్తిగా ఉందని కులకర్ణి హర్షం వ్యక్తం చేశారు. పసికందు ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు డాక్టర్ల సేవలను ఇతర ప్రయాణికులు కూడా ప్రశంసించారు.