అమెరికా సిడిసిపి అధ్యయనం వెల్లడి
వాషింగ్టన్ : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చనిపోయే ప్రమాదం 11 రెట్లు తక్కువని అమెరికా అధ్యయనం వెల్లడించింది. అలాగే టీకాలు తీసుకోని వారితో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంటుందని పేర్కొంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రచురించిన మూడు అధ్యయనాల్లో ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరాన్ని వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా తగ్గిస్తోందని అధ్యయనం తెలిపింది. జూన్ ఆగస్టు నెలల్లో ఆస్పత్రులు , అత్యవసర విభాగాల్లో చేరిన 32,000 మంది రోగులపై అధ్యయనం చేసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్లు 86 శాతం ఆస్పత్రిలో చేరకుండా రక్షణ కల్పించాయి. కానీ 75 ఏళ్లు దాటిన వారికి అది 76 శాతంగా పడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. ఏదేమైనప్పటికీ టీకాలు అధిక వయసు గలవారికి రక్షణ కల్పిస్తున్నాయని అధ్యయనంలో నిరూపితమైంది. ఆస్పత్రిలో చేరడం,ఐసియులో చికిత్స తీసుకోవడం వంటి వాటి నుంచి 82 శాతం కంటే ఎక్కువ మందికి ఈ టీకాలు రక్షణ కల్పించాయి.