Monday, December 23, 2024

విమానంలో తాగుబోతుల వీరాంగం..

- Advertisement -
- Advertisement -

ముంబై: దుబాయ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు తప్పతాగి తోటి ప్రయాణికులను సిబ్బందిని దుర్భాషలాడడంతో వారిని అరెస్టు చేసినట్టు పోలీస్ అధికారులు గురువారం తెలిపారు. ముంబైలో బుధవారం విమానం దిగగానే వారిని అదుపులోకి తీసుకున్నామని, తరువాత వారిని కోర్టుకు హాజరు పర్చాక, బెయిల్ మంజూరైందని చెప్పారు. ఇండిగో ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఇద్దరు ప్రయాణికులు 6ఇ 1088 విమానంలో దుబాయి నుంచి ముంబైకు ప్రయాణిస్తున్నారని, వారు బాగా మద్యం మత్తులో ఉన్నట్టు గమనించామని, సిబ్బంది ఎంత వారించినా వినకుండా అదేపనిగా మద్యం తాగుతూ ఉన్నారని పేర్కొంది. సిబ్బందిని తోటి ప్రయాణికులను వారు దూషించడం మొదలు పెట్టారు. వారి వికృత ప్రవర్తనకు నిబంధనల ప్రకారం వారిని సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీకి అప్పగించడమైంది.

ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగినందుకు విచారిస్తున్నాం అని ఇండిగో ప్రకటనలో పేర్కొంది. నిందితులు ఇద్దరూ మహారాష్ట్ర లోని పాల్ఘర్, కొల్హాపూర్ ప్రాంతాలకు చెందిన వారు. ఏడాది పాటు గల్ఫ్‌లో పనిచేసి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గల్ఫ్‌లో బయలుదేరే ముందు వారు అక్కడి డ్యూటీ ఫ్రీషాపులో మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత విమానంలోనే మద్యం సేవించడం ప్రారంభించారు. దీనిపై తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పగా, వారిపై దుర్భాషలాడారు.

నిందితుల్లో ఒకరు బాటిల్ చేతితో పట్టుకుని విమానంలో నిర్లక్షంగా నడుస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. దీంతో విమానం లోని సిబ్బంది అతడి చేతిలోని మద్యం బాటిల్‌ను బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినందుకు ఐపిసి 336 తోపాటు ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనల్లోని 21, 22, 25 నిబంధనల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. విమానంలో ప్రయాణికులు ఇబ్బందికరంగా ప్రవర్తించిన సంఘటనలకు సంబంధించి ఈ ఏడాది ఇది ఏడో కేసుగా పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News