Monday, January 20, 2025

ఆగని డ్రగ్స్ దందా..విద్యార్థులే విక్రేతలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను నిర్మూలించాలని పోలీసులు ఎంతలా ప్రయత్నం చేస్తున్నా ఎక్కడో అక్కడ వాటిని విక్రయిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల కాలంలో వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్, యువకులు పలువురు డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. గతంలో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్లు నగరంలో ఏజెంట్లను పెట్టుకుని డ్రగ్స్‌ను విక్రయించేవారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం గత కొంత కాలం నుంచి సీరియస్‌గా దృష్టి సారించడంతో పోలీసులు వరుసగా నిందితులను అరెస్టు చేశారు. గత ప్రభుత్వం డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు తెంగాణ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసి దానికి డిజి స్థాయి పోలీస్ అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. కింది స్థాయిలో కూడా పలు టీములను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ విక్రయించేవారు, సరఫరా చేసేవారు,వినియోగిస్తున్న వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించడం ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యప్తంగా డ్రగ్స్ కొంత వరకు కంట్రోల్‌లోకి వచ్చింది, కానీ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయించేవారు, వినియోగదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నా కూడా ఎక్కడో ఒకచోట డ్రగ్స్ విక్రయాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి.

హైదరాబాద్ కమిషనర్‌గా సివి ఆనంద్ పనిచేసిన సమయంలో నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న గోవాకు చెందిన పలువురు స్మగ్లర్లను అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. వారిని కస్టడీలోకి తీసుకుని ఇక్కడ వారి ఏజెంట్లను గుర్తించి అరెస్టు చేశారు, ఆ ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంత వరకు డ్రగ్స్ విక్రయాలు అదుపులోకి వచ్చాయి, గతంలో పబ్బులు డ్రగ్స్‌కు అడ్డాగా ఉండేవి, చాలామంది విక్రేతలు డ్రగ్స్ విక్రయించేందుకు పబ్బులకు వచ్చేవారు. కొన్ని పబ్బుల యజమానులు డ్రగ్స్‌కు డిమాండ్ ఎక్కువ ఉండడంతో వారే కొనుగోలు చేసి తీసుకుని వచ్చి పబ్బుకు వచ్చే వారికి విక్రయించేవారు. వీరి మూలాలను కనిపెట్టిన పోలీసులు దాదాపుగా వారి నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా అడ్డుకున్నారు. కానీ డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారు, సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి నగరంలోకి డ్రగ్స్ తీసుకుని వస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు అక్కడ డ్రగ్స్‌కు బానిసగా మారాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి బెంగళూరులో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు బస్సు ద్వారా తీసుకుని వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో ఎస్‌ఓటి పోలీసులు నార్సింగిలో పట్టుకుని ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడుతున్నవారిలో ఎక్కువగా విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. వీరందరూ సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశతో డ్రగ్స్ విక్రయిస్తు పోలీసులకు పట్టుబడుతున్నారు.

విద్యార్థులే విక్రేతలు….
ప్రస్తుతం డ్రగ్స్‌తో పట్టుబడుతున్న వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ముందుగా వారు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు, తర్వాత వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్నవారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. లాభాలు ఎక్కువ రావడంతో ఇలా దేశంలోని ముంబాయి, బెంగళూరు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి విక్రయిస్తున్నారు. వీరు ఎక్కువగా ఎండిఎంఏ, కొకైన్‌ను ఎక్కువగా విక్రయిస్తున్నారు. కొంత మొత్తం వారు తీసుకుని మిగతా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. కూకట్‌పల్లి, జగద్గిరిగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తు పట్టుబడిన వారిలో యువకులు అందరూ డిగ్రీ,ఇంజనీరింగ్ చేస్తున్న వారే ఉన్నారు. కూకట్‌పల్లిలో నీలేష్ రెడ్డి, కట్టా రాజశేఖర్‌రెడ్డి నుంచి 3గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిలక్‌సింగ్, జూలపల్లి అఖిల్ శివ కలిసి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు గ్రాముల ఎండిఎంఏ, 45గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో నిందితులు విద్యార్థులే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News