Wednesday, January 22, 2025

ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సమయంలో హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు, రాంగోపాల్ పేట పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో ఇద్దరు డ్రగ్స్ సరఫరాదారులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 3 గ్రాముల కొకైన్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, కొండాపూర్‌కు చెందిన మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్ వ్యాపారం చేస్తున్నాడు. బంజారాహిల్స్‌కు చెందిన మన్యం కృష్ణ కిషోర్ రెడ్డి కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ డిజే ఈవెంట్లు నిర్వహించే మోహిత్ అగర్వాల్ ముంబాయి, గోవా, హైదరాబాద్, బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా హైదరాబాద్‌లోని పలువురు పబ్బుల నిర్వాహకులతో పరిచయాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పబ్బుల్లో కూడా ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తున్నాడు.

పార్టీలు నిర్వహించే క్రమంలో మోహిత్ కొకైన్‌కు బానిసగా మారాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన మోహిత్, గోవాకు చెందని ఎడ్విన్ వద్ద కొకైన్‌ను కొనుగోలు చేసి పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. గోవాలో పార్టీలు నిర్వహించడంతో అంతరాష్ట్ర డ్రగ్స్ సప్లయర్ ఎడ్విన్‌తో మోహిత్‌కు సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ఎడ్విన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయించడం ప్రారంభించాడు. కాగా మరో నిందితుడు మన్యం కృష్ణకిషోర్ రెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎపి, తెలంగాణలో కేఎంసి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పాటు కిషోర్ పబ్బులు, హోటళ్లలో స్నేహితులతో కలిసి పార్టీలు నిర్వహిస్తున్నాడు. కిషోర్ ఎపికి చెందిన మాజీ మంత్రికి సమీప బంధువుగా తెలిసింది. పబ్బుల్లో పార్టీలు నిర్వహించడంతోపాటు డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడు.

తరచూ గోవాను సందర్శించేవాడు అక్కడ డ్రగ్స్ విక్రయించే ఎడ్విన్‌తో పరిచయం ఏర్పడింది. ఎడ్విన్‌తో పాటు బెంగళూరుకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. బెంగళూరుకు చెందిన వ్యక్తి ద్వారా డ్రగ్స్ బస్సుల్లో నగరానికి తెప్పించుకుని ఇక్కడ అవసరం ఉన్న వారికి విక్రయించేవాడు. వారికి గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించేవాడు. బంజారాహిల్స్‌లోని ఓ పబ్బులో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు కిషోర్‌రెడ్డిని అరెస్టు చేశారు. కిషోర్ హైదరాబాద్‌లోని పబ్బులు, సినీ వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఎడ్విన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి పట్టుకున్నారు. ఇద్దరిపై రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉండడంతో దర్యాప్తు కోసం అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు డానియల్, ఇన్స్‌స్పెక్టర్ లింగేశ్వర్ రావు పట్టుకున్నారు.
మోహిత్ కాంటాక్ట్ లిస్ట్‌లో..
నగరంలోని పలువురికి మోహిత్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులకు తెలిసింది. మోహిత్ అగర్వాల్ నుంచి కొకైన్‌ను వ్యాపారస్థులు, ప్రముఖులు, సినీరంగానికి చెందిన వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోహిత్ వద్ద వంద మంది డిజేలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News