Sunday, January 19, 2025

ఇద్దరు నకిలీ నక్సలైట్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నక్సలైట్ల పేరుతో వ్యాపారులను తుపాకులో బెదిరించి డబ్బు వసూలు చేసే ఇద్దరు సభ్యులతో కూడిన నకిలీ నక్సలైట్ల ముఠాను ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఖమ్మం నగరంలో కస్బాబజర్‌లో ఎలక్రానిక్ గూడ్స్ వ్యాపారం చేసే మహమ్మద్ అఫ్సర్, బయ్యారం మండలం, ఖమ్మం ఖానాపురంలో నివాసం ఉండే కొత్తపేట వాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండమల్ల వెంకటేశ్వర్లు ఇద్దరూ గతంలో నక్సలైట్ల పేరుతో వ్యాపారులను తుపాకులతో బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. వీరిపై మహబూబాబాద్, గార్ల, మరిపెడ, ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. కొంతకాలం వీటన్నింటికీ దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు.

అయితే ఆ వ్యాపారంలో పూర్తిగా నష్టాలు రావడంతో మళ్ళీ నకిలీ నక్సలైట్ల అవతారం ఎత్తి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అవసరమైన ఆయుధాల కోసం ఖమ్మం నగరానికి చెందిన ఎండి రియాజ్‌ను సంప్రదించారు. అఫ్సర్, వెంకటేశ్వర్లు, రియాజ్ కలిసి బీహార్ రాష్ట్రానికి వెళ్లి ఆయుధాల కోసం ప్రయత్నించారు. తొలి ధఫా ప్రయత్నంలో వారికి ఆయుధాలు లభించలేదు. దాదాపు 11 నెలల క్రితం మరోసారి ఈ ముగ్గురు కలిసి మరోసారి బిహార్ వెళ్లి 7 ఎంఎంకు చెందిన మూడు పిస్టల్స్, నాలుగు మాగ్జిన్లు, 17 బుల్లెట్స్‌ను కొనుగోలు చేసుకొని వచ్చారు. గత కొంతకాలంగా ఆయుధాలను చూపించి వ్యాపారులను బెదిరిస్తూ గడుపుతున్నారు. ఆదివారం ముదిగొండలోని గ్రానైట్ వ్యాపారులను బెదిరించేందుకు ఆయుధాలను ధరించి ద్విచక్రవాహనంపై ప్రకాశ్‌నగర్ సమీపంలోని రోడ్డుపై నుంచి వెళ్తుండగా త్రీటౌన్ సిఐ,

ఎస్‌ఐ, ఇతర సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి సదరు నకిలీ నక్సైలైట్లు పారిపోతుండటంతో వారిని వెంటాడి పట్టుకున్నారు. వారిని తనిఖి చేయగా మూడు పిస్టల్స్, నాలుగు మాగ్జిన్లు, 17బుల్లెట్లు లభించాయి. వాటితో పాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు రియాజ్ పరారీలో ఉన్నారు. ఇదిలావుండగా, 1996లో ఖమ్మం రూరల్ మండలం, గుదిమళ్ళలో జరిగిన ఒక హత్య సంఘటనలో ఉపయోగించిన ఆయుధాలను కూడా ఈ ముఠానే సమకూర్చినట్లు తెలిసింది. ఈ ముఠాలో ఒకరిది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కావడంతో వీరు నకిలీ నక్సలైట్లు చెలామణి కావడంతో పాటు అప్పట్లో పేరుగాంచిన చిన్నచిన్న నక్సలైట్ల ముఠాకు కొరియర్‌గా కూడా పనిచేసినట్లు సమాచారం. వీరిని తిరిగి పోలీస్ కసడీకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని సిపి తెలిపారు.

అరెస్టయిన ఇద్దరితోపాటు పరారీలో ఉన్న రియాజ్ పై పలు స్టేషన్లో ఆయుధాల చట్టం కింద బెదిరించిన కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన త్రీటౌన్ సిఐ, ఎస్‌ఐ, ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఖమ్మం టౌన్ ఏసిపి రమణమూర్తి, త్రీటౌన్ సిఐ రమేశ్, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News