తొర్రూరు : పొలానికి వెళ్లి భోజన సమయానికి వస్తామని చెప్పి ఇద్దరు రైతులు కరెంట్ షాక్‌తో మృత్యువాతపడ్డారు.ఈ విషాద ఘటన మహబూబ్‌బాబాద్ జిల్లా మండలంలోని భోజ్యతండాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని భోజ్యతండాకు చెందిన మాలోతు యాకూబ్(50), భూక్య సుధాకర్(28)లు ఉదయాన్నే పొలానికి వెళ్లి నీటి మోటారు ఫీజుల బాక్స్ సరి చేస్తుండగా ఆ సమయంలో విద్యుత్ సరఫరా అయి ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన భూక్య సుధాకర్ వ్యవసాయంపై మక్కువతో తండాలో ఉంటూ విభిన్న పంటల సాగు చేస్తున్న క్రమంలో హటాత్తుగా ఈ పరిణామం తండావాసులను హతశులను చేసింది. మరో రైతు మాలోతు యాకూబ్ తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని నమ్మి ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. పంటల ద్వారా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని సాకడంతో పాటు నలుగురు పిల్లల వివాహాలను చేశాడు.
ఈ క్రమంలో ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న పొలంలోనే తుది శ్వాస విడవడంతో తండావాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో భోజ్యాతండా ప్రజల రోదనలు మిన్నంటాయి. ఘటన స్థలానికి జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావు, తహశీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, సీఐ కరుణాకర్‌రావు, ఎస్‌ఐ మునీరుల్లా, స్థానిక సర్పంచ్ కాలునాయక్, వెలికట్ట సర్పంచ్, ఎంపీటీసీ పోసాని పుష్పలీల, బత్తుల మల్లయ్యలు సందర్శించారు. ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు రైతులు పొలంలోనే ప్రాణాలు విడవడంతో భౌతికకాయాలను చూసేందుకు తండావాసులు, శివారు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూక్య సుధాకర్ మృతదేహంను కుమారులైన దుశ్వంత్, యశ్వంత్‌లు లే డాడీ… ఇంటికి వెళ్దాం అంటుండటంతో అక్కడ ఉన్న ప్రజలు, బంధువులు, తండావాసులు కన్నీరు తెప్పించాయి. మృతుడు మాలోతు యాకూబ్‌కు భార్య కోమాలి, నలుగురు సంతానం కాగా భూక్య సుధాకర్‌కు భార్య మైబు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాధితులకు అండగా ఉంటా : పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మండలంలోని భోజ్యతండాలో ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పొలంలో విద్యుత్ వైర్లు సరి చేస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పొలాలకు వెళ్లే రైతులు ఈ సమయంలో విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.