నలుదిక్కులా కిలోమీటర్‌మేర పోలీస్ పహారా మధ్య అంత్యక్రియలు
ఉన్నావో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు టీనేజ్ బాలికల అంత్యక్రియల్ని భారీ బందోబస్త్ మధ్య శుక్రవారం నిర్వహించారు. వారిద్దరూ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. దాంతో, గ్రామానికి నలుదిక్కులా కిలోమీటర్‌మేర పోలీసుల్ని మోహరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. బాబూహరా గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం ఉదయం 16,15,14 ఏళ్ల బాలికలు పశువులకు గడ్తి తేవడానికని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు.
వారు తిరిగి రాకపోవడంతో అదేరాత్రి బంధువులతో కలిసి వారి కుటుంబసభ్యులు వెతకగా, వ్యవసాయ క్షేత్రంలో అపస్మారకస్థితిలో కనిపించారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇద్దరు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాణాలతో ఉన్న 16 ఏళ్ల బాలికను వైద్యుల సూచనమేరకు కాన్పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలికకు చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఇద్దరు బాలికల శవాల్ని పోస్ట్‌మార్టమ్ అనంతరం గురువారమే గ్రామానికి తీసుకెళ్లినా, ఉద్రిక్తత వల్ల అంత్యక్రియల్ని ఒక రోజు వాయిదా వేశారు. అంతిమ సంస్కారాలకు బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ్‌కిషోర్ రావత్, స్థానిక ఎంఎల్‌ఎ అనిల్‌సింగ్ హాజరయ్యారు.