Friday, December 20, 2024

ఎన్నికల వేళ రాష్ట్రంలో పలుచోట్ల విషాదం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో పలుచోట్ల విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడగా, మరొకరు పాముకాటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందగా, ఉప్పల్ పరిధిలో ఓ మహిళ ఓటు వేయడానికి వచ్చి మృతిచెందింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ టీచర్‌ను పాముకాటు వేయడంతో ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

గుండెపోటుతో సీనియర్ అసిస్టెంట్…..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లోని 165 పోలింగ్ బూత్‌లో సోమవారం విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో అక్కడ కాసేపు పోలింగ్ ఆగిపోయింది. అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీ కృష్ణ కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. విషయం తెలిసిన మృతుడి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

ఉప్పల్‌కు చెందిన మహిళా ఓటరు గుండెపోటుతో….
ఉప్పల్‌లోని భరత్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మిఅనే మహిళా ఓటరు ఓటు వేయడానికి వెళ్లి గుండె పోటుతో మృతి చెందింది. పోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో విజయలక్ష్మి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి పాముకాటు..
ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై పాము కాటు వేసింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ముక్తాపూర్‌లో టీచర్‌గా పనిచేస్తున విపుల్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణలోని 15వ పోలింగ్ కేంద్రంలో ఓపీఓగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆయన టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. వెంటనే ఆయన్ను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఫోన్‌లో పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News