Monday, January 20, 2025

ఎపి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎటువంటి అనుమతులు పొందకుండానే కృష్ణానదిపై అక్రమంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను చేపట్టింది. ప్రకాశం బ్యారేజికి దిగువన 50టిఎంసీల నీటివినియోగపు లక్ష్యాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్యబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు దెబ్బతింటాయిని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు వివరించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం నాడు కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ ద్వారా ఎపిలోని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. ఏపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను రూ.2565కోట్లతో నిర్మిస్తోందని బోర్డు దృష్టికి తీసుకుపోయారు. ప్రకాశం బ్యారేజికి 12కిలోమీటర్ల దిగువన పెనమలూరు మండలం పరిధిలో కృష్ణానదిపై 2.70టిఎఎంసీల నీటి నిలువ సామర్ధంతో బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మాణం చేపట్టిందని తెలిపారు. రూ.1215కోట్ల ప్రాధమిక అంచనాలతో చేపట్టిన ఈ బ్యారేజి ద్వారా కృష్ణానది నుంచి 25టిఎంసీల నీటిని అక్రమంగా ఉపయోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. అంతే కాకుండా ఈ బ్యారేజికి దిగువన మరో బ్యారేజికి కూడా డిపిఆర్‌లు సిద్దం చేసింది.

ప్రకాశం బ్యారేజికి దిగువన 62కిలోమీటర్ల వద్ద మోడిదేవి మండల పరిధిలో ఈ బ్యారేజి నిర్మిస్తున్నట్టు లేఖలో స్పష్టం చేశారు. 4.70టీఎంసీల నీటి నిలువ సామర్ధంతో నిర్మిస్తున్న ఈ బ్యారేజి ద్వారా కృష్ణాజలాల నుంచి 25 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. కృష్ణానదికి ఇరువైపుల ఉన్న పొలాలకు నీటిని అందించేందుకే ఈ ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డిపిఆర్‌లను కూడా రూపొందించింది. త్వరలోనే పనుల ప్రారంభానికి టెండర్లు కూడా పిలిచే ప్రయత్నాలు చేస్తోంది. కృష్ణానదీయాజమాన్య బోర్డులో చర్చించకుండా. కేంద్ర జలసంఘం ఆమోదం కూడా పొందకుండా , అపెక్స్ కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకుపోకుండా ఏకపక్షంగా ఏపి ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టింది. తక్షణం ఈ ప్రాజెక్టులను ఆడ్డుకోవాలని ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు రాసిన లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.

పంపుడ్ స్టోరేజి ప్రాజెక్టులను ఆపండి:

ఆంధప్రదేశ్‌లో ఎటువంటి అనుమతులు లేకుండానే గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతో నిర్మిస్తున్న పంపుడ్ స్టోరేజి ప్రాజెక్టుల పనులు ఆపాలని కోరూతూ కృష్ణనదీయాజమాన్యబోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. ఏపిలో ప్రభుత్వ కనుసన్నల్లోనే ఆదాని గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో 3700మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆదాని గ్రూప్ రూ.60వేలకోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. ఇందులో కడప జిల్లా గండికోట జలాయశం నీటి ఆధారంగా 1000మెగావాట్లు , అనంతపురుం జిల్లా చిత్రావతి రిజర్వాయర్ నీటి ఆధారంగా 500మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్షంగాగ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు లేఖలో వివరించారు. ఇదివరకే కర్నూలు జిల్లాలోని గోరుకల్లు నరసింహరాయ సాగర్ జలాశయం నుంచి నీటినివాడుకునేలా మరో పవర్‌ప్రాజెక్టు కూడా నిర్మాణంలో ఉందని తెలిపారు.

కృష్ణానదీజలాలను అక్రమంగా వాడుకునేందుకే ఈ ప్రాజెక్టులు చేపట్టారని స్పష్టం చేశారు. జాతీయ జల విధానం ప్రకారం తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సివుందన్నారు. అ తర్వాత సాగునీటికి ,ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ జలవిధానాలను ఏ మాత్రం ప్రాటించకుండా ఏపి ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం పంపుడ్ స్టోరేజి అవసరాలకు కృష్ణానదీజలాలను ఉపయోగించుకోజూస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుల పనులు పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News