కైరో : ఈజిప్టు లోని మధ్యధరా నగరమైన అలెగ్జాండ్రియాలో ఇజ్రాయెల్ టూరిస్టులపై ఈజిప్టు పోలీస్‌మాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ టూరిస్టులతో పాటు ఈజిప్టు వ్యక్తి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అలెగ్జాండ్రియా లోని పోంపే పిల్లర్ ప్రదేశంలో ఈ సంఘటన జరిగింది. ఈజిప్టు భద్రతా వ్యవస్థతో సన్నిహితంగా ఉన్న ఎక్స్‌ట్రా న్యూస్ టెలివిజన్ ఛానల్ ఈ సంఘటన గురించి వివరిస్తూ మరో వ్యక్తి గాయపడ్డాడని, అనుమానిత దుండగుడ్ని అదుపు లోకి తీసుకున్నారని పేర్కొంది.
దాడి జరిగిన ప్రదేశాన్ని భద్రతా బలగాలు తక్షణం దిగ్బంధం చేశాయి. గాయపడిన బాధితులను మూడు అంబులెన్స్‌లు ఆస్పత్రులకు తరలించడం వీడియో దృశ్యాల్లో వైరల్ అయింది. కొన్ని దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్‌తో ఈజిప్టు శాంతి ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్‌కు, పాలస్తీనా సంఘర్షణలో మధ్యవర్తిగా ఈజిప్టు వ్యవహరిస్తోంది. కానీ ఇజ్రాయెల్ వ్యతిరేక భావజాలం ఈజిప్టులో ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా హింసాత్మక పోరు సమయంలో చాలా విపరీత ప్రభావం కనిపిస్తోంది.