ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలో శనివారం నక్సలైట్లు ఒక ఐఇడి పేల్చగా ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటిబిపి) సిబ్బంది ఇద్దరు మరణించగా మరి ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అబూఝ్‌మాడ్ ప్రాంతంలోని కొడ్లియార్ గ్రామంలో నక్సల్ వ్యతిరేక కార్యక్రమం కోసం భద్రత సిబ్బంది సంయుక్త బృందాలు వెళ్లినప్పుడు శనివారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకున్నదని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
ఐటిబిపి, బిఎస్‌ఎఫ్, పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)కి చెందిన సిబ్బంది ఓర్ఛా, ఇరక్‌భట్టి, మొహండి ప్రాంతాల్లో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. గస్తీ బృందాలు ఆ కార్యక్రమం నుంచి తిరిగి వస్తున్నప్పుడు పేలుడు జరిగిందని, గాయపడిన నలుగురు సిబ్బందిని ఆసుపత్రికి తరలించారని అధికారి తెలిపారు. ఇద్దరు ఐటిబిపి సిబ్బంది గాయాలతో మరణించగా, క్షతగాత్రులైన పోలీస్ సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆయన చెప్పారు.