Wednesday, January 22, 2025

సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు జడ్జీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు కొత్తగా కొలువు దీరారు. జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కల్పతి వెంకట్రామన్ విశ్వనాథన్‌లతో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య గరిష్ఠ పరిమితి 34కు (సిజెఐతో కలిపి) చేరింది. సుప్రీంకోర్టు జడ్జీలుగా మిశ్రా, విశ్వనాథన్ పేర్లను కొటీజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. రెండు రోజుల్లోనే ఈ నియామకాలకు కేంద్రం పచ్చ జెండా ఊపింది.

వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆమోదముద్ర వేశారు. నూతన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సైతం ట్విట్టర్ వేదికగా ఈ నియామకాలను ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి జడ్జీల సంఖ్య కొద్ది రోజులు మాత్రమే కొనసాగనుంది. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ రస్తోగి, జస్టిస్ రామసుబ్రమణియన్‌లు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మురళి జులై 8న రిటైర్ అవుతారు.

ఎపి హైకోర్టు చీఫ్ జస్టిస్‌నుంచి..
చత్తీస్‌గఢ్‌కు చెందిన జస్టిస్ మిశ్రా చత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేశారు. హైకోర్టు జడ్జిగా 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. హైకోర్టు జడ్జీలాలిండియా సీనియార్టీ జాబితాలో 21వస్థానంలో ఉన్నారు.

బార్ కౌన్సిల్‌నుంచి నేరుగా..
తమిళనాడుకు చెందిన కెవి విశ్వనాథన్.. బార్ కౌన్సిల్‌నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు. సీనియార్టీ ప్రకారం 2030 ఆగస్టు 11న జస్టిస్ జెబి పార్దీవాలా పదవీ విరమణ తర్వాత జస్టిస్ విశ్వనాథన్ సిజెఐగా నియమితులు కానున్నారు. 2031 మే 21 వరకు ఆ పదవిలో ఉంటారు. ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే బార్ కౌన్సిల్‌నుంచి సుప్రీంకోర్టు సిజెఐ స్థాయికి చేరుకున్నారు. వారిలో మొదటి వ్యక్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రి మొదటి వ్యక్తి కాగా జస్టిస్ యుయు లలిత్ రెండో వ్యక్తి. ప్రస్తుతం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ పిఎస్ నరసింహ కూడా ఆ జాబితాలో చేరనున్నారు. న్యాయవాదిగా వివిధ అంశాలకు చెందిన కేసులను వాదించిన జస్టిస్ విశ్వనాథన్.. ఇటీవల స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపైనా పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News