Thursday, December 19, 2024

టైర్ పేలి బైక్‌ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

- Advertisement -
- Advertisement -

వేములపల్లి : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ బరస్ట్ అయి రోడ్డు డివైడర్ దాటి అవతలి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇద్దరు వలస కార్మికులు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా మండల పరిధిలోని అన్నపురెడ్డిగూడెం స్టేజి సమీపంలోని నార్కెట్‌పల్లిఅద్దంకి రహదారి పై చోటు చేసుకుంది. బస్సులోని ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా విప్పనగండ్ల మండలం తూమకుంట తండాకు చెందిన రస్లావత్ మంగ్యా (40) ప్రైవేటు వెంచర్లలో రోడ్డు, డ్రైనేజీ వర్క్‌లు చేయిస్తూ జీవిస్తున్నాడు. కాగా మంగ్యా సంవత్సర కాలంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వెనుక భాగంలో పూరిగుడిసె వేసుకుని జీవిస్తున్నాడు. మంగ్యా మిర్యాలగూడ మండలం కిష్టాపురం స మీపంలో ఒక వెంచర్‌లో పని ఒప్పుకొని సోమవారం ఉదయం ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన రాదేశరాత్రే (38) మరో కార్మికుడు గణపతిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నల్లగొండ నుంచి మిర్యాలగూడ మండలం కిష్టాపురం బయలదేరాడు.

ముగ్గురు ద్విచక్ర వాహనంపై వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం స్టేజి సమీపంలోకి రాగా అదే సమయంలో చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న శామసర్ధార్ ట్రావెల్స్ బస్సు టైర్ పగిలి ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి మంగ్యా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో రస్లావత్ మంగ్యా, రాదేశరాత్రేలు అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడు గణపతికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు బస్సులోని పలువురు ప్రయాణికులను రోడ్డు పైకి తీసుకొచ్చి గాయపడిన వారిని 108, ఇతర వాహనాల్లో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై విజయ్‌కుమార్‌లు తమ సిబ్బందితో కలిసి సంఘన స్థలానికి ప్రయాణికులను పలు వాహనాలలో తమ స్వస్థలాలకు పంపించగా గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన గణపతి పరిస్థితి విషయంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News