Thursday, January 23, 2025

‘రియల్’ కాల్పులకు ఇద్దరు బలి

- Advertisement -
- Advertisement -

Two killed in the shooting in Rangareddy

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో సంచలనం

మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద మంగళవారం ఉదయం 6.30 గంటలకు జరిగిన కాల్పులలో రియాల్టర్లు నవార్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు మృతి చెందారు. భూ దందాకు సంబంధించి సెటిల్‌మెంట్ కోసం స్కార్పియో కారులో రియాల్టర్లు అల్మాస్ గూడాకు చెందిన నవార్ శ్రీనివాసరెడ్డి, ఆన్‌ఎన్ నగర్‌కు చెందిన కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు కర్ణంగూడాకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియల్టర్ నవార్ శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తీవ్రగాయాలతో బిఎన్ రెడ్డిలోని బృంగీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలావున్నాయి..రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కలిసి ఇబ్రహీంపట్నం పరిధిలోని లేక్ వ్యూస్కు సమీపంలో వెంచర్ వేశారు.

ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం ఆ వెంచర్‌లలో బోర్ వేయించేందుకు వీరిద్దరూ స్కార్పియోలో వెళుతున్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వారి పేర్కొన్నారు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాసరెడ్డిని పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల ఘటన చూసి రాఘవేందర్‌రెడ్డి భయంతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా దుండగులు వెంబడించి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాఘవేందర్‌రెడ్డిని స్థానికులు గమనించి బిఎన్‌రెడ్డిలోని బృంగీ ఆస్పత్రికి వైద్య సేవల నిమిత్తం తరలించారు. కాల్పులు జరిగిన ఘటనాస్థలిని రాచకొండ సిపి మహేశ్ భగవత్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వ్యాపారంలో వివాదాలు?

రియాల్టర్లు నవార్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలపై కాల్పులకు గల కారణం భూ వివాదాలే అన్న కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతోంది. రియాల్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, మట్టారెడ్డి కలిసి పటేల్‌గూడాలో 22 ఎకరాల్లో ఓ వెంచర్ వేశారు. ఈ వెంచర్ విషయంలో మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి మధ్య గత ఆరు నెలలుగా వివాదాలు కొనసాగుతున్నా యి. అయితే మంగళవారం ఉదయం 5 గంటలకు మట్టారెడ్డి పిలవడంతో నవార్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు కర్ణంగూడాకు బయలుదేరారు. భూ వివాదాల కారణంగానే మట్టారెడ్డి మిగతా ఇద్దరిపై కాల్పులు జరిపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

అదుపు తప్పిన స్కార్పియో

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనాన్ని స్థానికులు గమనించారు. కారుపై రక్తపు మరకలు ఉండటం.. వాహనంలో ఓ వ్యక్తి స్పృహలో లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. మరో వ్యక్తి శ్రీనివాసరెడ్డి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని రాఘవేందర్ రెడ్డిగా గుర్తించారు. సమీపంలోని బిఎన్‌రెడ్డిలోని బృంగీ అనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాఘవేందర్ మంగళవారం ఉదయం 9 గంటలకు మృతి చెందారు. అతని ఛాతీ కింద బుల్లెట్ గాయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అదుపులో అనుమానితుడు

రియాల్టర్లపై కాల్పుల జరిగిన సమాచారం అందుకున్న రాచకొండ సిపి మహేశ్ భగవత్, ఇబ్రహీంపట్నం ఎసిపి బాలకృష్ణారెడ్డి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా అనుమానుతులను ప్రశ్నిస్తున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యుల అనుమానం మేరకు వ్యాపార భాగస్వామి అయిన మట్టారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మృతులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై గతంలో పలు భూ దందా కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కాల్పుల కేసులో ట్విస్ట్

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డిలపై గతంలో పలుమార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తమ భూమినీ కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలీసులను లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు. వారం రోజుల క్రితం కూడా ఫ్లాట్ ఓనర్స్‌ను శ్రీనివాస్ రెడ్డి బెదిరించడంతో లేక్ విల్లా ఓనర్స్ కోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమయ్యారు. ఈక్రమంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి మరణించారు. కాగా 1996లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వాసులకు ఇంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, దేవి, పురుషోత్తంరెడ్డి భూమి అమ్మారు. నెల్లూరు వాసుల నుంచి ఆ భూమిని లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ సభ్యులు సెల్ డీడ్ చేసుకున్నారు.

ధరణిలో అదే భూమికి ఓనర్లుగా ఇంద్ర రెడ్డి, నర్సింహ రెడ్డి పేర్లు చేర్చారు. అయితే 10 ఎకరాల వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా చూపించి ఇంద్రారెడ్డి వద్ద నుంచి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవరెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పటి నుంచి లేక్ విల్లా ఫ్లాట్స్‌లోకి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి వెళ్లి జెసిబిలతో అక్రమంగా చోరబడి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గత నెలలోనూ మృతులు శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డిలు తమను బెదిరించారని లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ పేర్కొంటున్నారు. లేక్ విల్లాతో పాటు ఇంకొన్ని భూములను కూడా వీరు ఇదే తరహాలో కబ్జా చేశారని లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. వీరిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని లేక్ విల్లా ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు.

ఆ మూడో వ్యక్తి ఎవరు?

రియాల్టర్లు నవార్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలపై కాల్పులకు భూ వివాదాలే కారణమన్న కోణంలో పోలీసు దర్యాప్తు సాగుతున్న క్రమంలో కారులో ఉన్న మూడో వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్కార్పియోలో మృతులు శ్రీనివాసరెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు మూడో వ్యక్తి అందించిన సమాచారం మేరకే నిందితులు కాల్పులు జరిపారన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇందులో భాగంగా కర్ణంగూడా వైపు ఉన్న సిసి కెమెరాలు, మృతుల కాల్ డేటా, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతులు శ్రీనివాస్ రెడ్డి నివాసముంటున్న అల్మాస్ గూడలోని వినాయక నగర్, రాఘవేందర్‌రెడ్డి ఆర్‌ఎన్ నగర్‌లలో పోలీసులు విచారణ చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News