Friday, November 22, 2024

బిఆర్‌ఎస్ గూటికి ఇద్దరు ముఖ్య నేతలు..!

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : అధిక శ్రావణం అయిపోయింది. నిజ శ్రావణం రానే వచ్చింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు ఆస్కారం కలుగుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కొందరు నేతలు పార్టీ మారేందుకు యోచిస్తున్నారు. ఈ కారణంగా కొద్ది రోజులుగా అనేక దఫాలుగా చర్చలు పూర్తయ్యాయి. దీంతో వారు శ్రావణ మాసంలో పార్టీ మారేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. మరో మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనునన్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలన్న పట్టుదలతో కొందరు నేతలున్నారు.అదే సమయంలో బలంగా ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా విపక్షాలకు అడ్రస్ లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహ రచన చేస్తోంది. దీంతో ఈ శ్రావణ మాసంలో అనేక మార్పులకు అవకాశం ఉన్నది. సిఎం కేసీఆర్ సొంత జిల్లాగా ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నది. పోయిన సారి సంగారెడ్డి మినహా మిగిలిన 9 అసెంబ్లీ స్థానాల్లో అధికార టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.

ఈ సారి ఆ ఒక్క స్థానం కూడా విపక్షానికి దక్కవద్దన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు అధికార పార్టీ టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఒక నేత నేరుగా అధికార పార్టీ ముఖ్య నేతతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. సంప్రదింపులు ఫలవంతం కావడంతో ఆయన చేరిక దాదాపుగా ఖరారు అయిందంటున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాసంలో ఏదో ఒక రోజున ఈ నాయకుడు తన అనుచరులతో అధికార పార్టీలో చేరనున్నారు. గతంలోనే ఈ నాయకుడు బిఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరగ్గా…వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం తానున్న కాంగ్రెస్‌లో ఆయన ఇమడలేకపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతతో ఆయన పొసగడం లేదు. ఇదే విషయాన్ని ఆయన అనేక సార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఈ ‘ఉక్కపోత’ను ఆయన ఇక ఎంతకాలం భరించే స్థితిలో లేరు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా చర్చల్లో ఉండే ఆ నాయకుడు…కొద్ది రోజులుగా వార్తల్లో కనిపించడం లేదు.

తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటున్నారు. ఈ నాయకుడితో జరిపిన చర్చలు ఫలించడంతో.. అధికార బిఆర్‌ఎస్ నుంచి కూడా వత్తిడి అధికంగా ఉంది. ఈ నాయకుడి చేరిక ద్వారా రాష్ట్రం మొత్తానికి ఒక సిగ్నల్ ఇవ్వాలన్న ఆలోచనలో అధికార పార్టీ ఉన్నది. విపక్షాన్ని కోలుకోలేని దెబ్బతీయాలన్న కసి అధికార పార్టీలో కనపడుతోంది. ఫలితంగా సదరు నాయకుడి చేరికను వీలైనంత త్వరగా జరపాలన్న యోచిస్తోంది. దీంతో ఆయన వీలైనంత త్వరగా తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి…అధికారిక ప్రకటన చేయనున్నట్టు తాజాగా తెలుస్తోంది. ఇంత కాలం కొనసాగిన ఊగిసలాటకు ఈ విధంగా ఆయన పుల్‌స్టాప్ పెట్టబోతున్నారు. దీనికి శ్రావణ మాసాన్ని ఆ నాయకుడు ఎంచుకున్నారు.అది కూడా ఈ నెలాఖరున మాత్రమే ముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండుగుత్తగా ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. మరో ముఖ్య నేత తరపున ఆయన సతీమణి రంగంలోకి దిగినట్టు ప్రచారం జరగుతోంది. ఈమె జరిపిన చర్చలు ఫలించడంతో బిఆర్‌ఎస్‌లోకి సదరు నేత చేరిక ఖాయమైందని తెలుస్తోంది.

గతంలో ఈ నేత తనతో పాటు మరో నలుగురికి కూడా పార్టీ టిక్కెట్లు ఇవ్వాలన్న డిమాండ్ చేయగా, తాజాగా జరిగిన చర్చల్లో కేవలం ఆయనకు, ఆయన కూతురి రాజకీయ భవిష్యత్‌పైన మాత్రమే ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టమైన హామీ లభించడంతో.. ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ టూ స్థాయి పదవిని పొందిన ఈ నాయకుడి చేరిక ఖాయమైందన్న ప్రచారం జరగుతోంది. శ్రావణ మాసం రావడంతో ఈ నాయకుడు కూడా ఒక మంచి రోజు చూసి ప్రకటించబోతున్నారు.ఈ విధంగా విపక్షానికి కొద్దో..గొప్పో విజయావకాశాలున్న ఈ రెండు నియోజక వర్గాలు కూడా అధికార బిఆర్‌ఎస్ పక్షాన చేరబోతున్నాయి. ఈ నెల 27 లేదా 28వ తేదీల్లో ఈ ఇద్దరు నేతల చేరికలు ఉండే అవకాశం ఉంది. ఈ చేరికలపై అటు కాంగ్రెస్‌లో, ఇటు అధికార బిఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఏ నోట విన్నా…శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా? అన్న చర్చనే జరిగింది. ఈ రోజుతో శ్రావణ మాసం రావడంతో ఇక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి సర్వతా నెలకొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News