మనతెలంగాణ/సదాశివనగర్: కామరెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పద్మాజివాడి చౌరస్తా వద్ద జరిగిన ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రులు చెల్లాచెదెరుగా పడిఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన కొందరు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్‌పూర్ గ్రామానికి అంత్యక్రియలకు బయలుదేరారు. తిరిగి వస్తున్నప్పుడు మార్గ మద్యలో పద్మాజివాడి చౌరస్తా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద టియస్ 05 యూసి7568 నంబరు గల లారీ వెనుక నుండి వేగంగా ఆటోను ఢీ కొటింది. ప్రమాదంలో గడ్డం మమత (30), గడ్డం లక్ష్మీ (28) చనిపోయారు. ఆటో డ్రైవర్ గడ్డం చిన్న సాయిలుతో పాటు మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ శేఖర్ తన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. సంగోజివాడి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.