పోలీసుల పనితీరుపై విచారణ: కర్నాటక హోం మంత్రి
శివమొగ్గ(కర్నాటక): శివమొగ్గలో ఇటీవల జరిగిన బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా..పట్టణంలో నిషేధాజ్ఞలను శుక్రవారం వరకు జిల్లా అధికారులు పొడిగించారు. బజరంగ్ దళ్ కార్యకర్త హత్య దరిమిలా పట్టణంలోని రెండు పోలీసు పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిపై విచారణకు ఆదేశించినట్లు హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర బుధవారం తెలిపారు. శివమొగ్గ పట్టణంలోని కోటె, దొడ్డపేటె పోలీసు స్టేషన్లో సిబ్బంది పనితీరుపై విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో ఈ రెండు పోలీసు స్టేషన్లలో ఎంతమంది పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేశారు..తీవ్ర నేర చరిత్ర ఉన్న ఈ కేసులోని నిందితులపై(అరెస్టు చేసిన 8 మంది) వారు ఎలా నిఘా పెట్టారు అన్న విషయాలు నిర్ధారించుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలకు దారితీసే బాధ్యతారహితులైన పోలీసు అధికారులను ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. గత ఆదివారం రాత్రి శివమొగ్గలో బజరంగ్ దళ్ కార్యకర్త 28 ఏళ్ల హర్ష కత్తిపోట్లతో హత్యకు గురైన విసఁం తెలిసిందే.