మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర అంతర్గత కర్ణాటక పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని మధ్య ప్రాంతం నుండి విదర్భ, మరఠ్వాడ ,అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్రమట్టం 0.9 కి.మి ఎత్తు వద్ద కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రానున్న 48గంటల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ వడగండ్ల వానలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది .ఆ తరువాత ఈ నెల తొమ్మిది నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసినట్టు తెలిపింది.